సినీయర్ హీరో.. కేంద్రమాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మరణంతో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నటనతో పాటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని..ఆయని మరణం ఎవరూ పూడ్చలేనిదని కొనియాడారు. ఇక సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ముందుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలను కుటుంబసభ్యులు భావించారు. కానీ ఆ తర్వాత ఆయన అంత్యక్రియల్లో స్వల్ప మార్పులు చేశారు.
పండితుల సూచన మేరకు కృష్ణంరాజు అంత్యక్రియల్లో స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నుంచి కృష్ణంరాజు అంతిమయాత్ర మొదలవనుంది. కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్ రిసార్ట్‌లో.. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. హాజరవుతారు. రెబల్ స్టార్ మన మధ్య లేరనే వార్తను ఇప్పటికీ చాలా మంది అభిమానులు, ఆప్తులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజును కడసారి చూసేందుకు ఫ్యాన్స్ హైదరాబాద్‌కు తరలి వస్తున్నారు. కృష్ణంరాజుకు నివాళులర్పించేందుకు.. అభిమానులకు అనుమతిస్తున్నారు. నిన్న కన్నుమూసిన ఆయన భౌతిక కాయాన్ని బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖల సందర్శనార్ధం సొంత నివాసంలో ఉంచారు. అభిమానుల సందర్శన తర్వాత ఈరోజు మధ్యాహ్నం కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభంకానుంది.