
తొలివలపు సినిమాతో హీరోగా సినీ ప్రయాణం స్టార్ చేసి ఆ తర్వాత విలనిజంతో భయపెట్టాడు గోపిచంద్. ఇప్పుడు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు,ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది రామబాణం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఆయన.. ఇటీవల భీమ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే రోటిన్ స్టోరీ కావడంతో ఈమూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వంలో గోపిచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 8న శివరాత్రి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న గోపిచంద్ తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా తన భార్యతో ప్రేమ, పెళ్లి గురించి అసలు విషయం చెప్పేశారు.
గోపిచంద్ సతీమణి రేష్మ.. సీనియర్ హీరో శ్రీకాంత్ కు మేనకోడలు అవుతుందని అందరికి తెలిసిన సంగతే. శ్రీకాంత్ అక్క కూతురిని 2013లో వివాహం చేసుకున్నాడు గోపిచంద్. వీరి పెళ్లి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, టాలీవుడ్ సెలబ్రెటీల మధ్యలో ఘనంగా జరిగింది. అయితే రేష్మతో తన వివాహం జరగడానికి ప్రధాన కారణమైన వ్యక్తి ఎవరనే విషయాన్ని గోపిచంద్ చెప్పుకొచ్చాడు.
గోపీచంద్ మాట్లాడుతూ.. ఒకచోట రేష్మ ఫోటోను చూశానని.. చూడగానే నచ్చిందని.. ఆ తర్వాత తను శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసిందని అన్నారు. అప్పటికే శ్రీకాంత్ తనకు పరిచయం ఉన్నాడని.. కానీ నేరుగా మాట్లాడి అడగలేను కదా.. అందుకే చలపతిరావు అంకుల్ (దివంగత నటుడు చలపతిరావు)కు ఈ విషయం చెబితే ఆయనే శ్రీకాంత్ తో మాట్లాడి తమ పెళ్లి అయ్యేలా చేశారని ఆయన దగ్గరుండి మాకు పెళ్లి చేశారు అని చెప్పుకొచ్చారు. అలాగే తన భార్య రేష్మ తనకు ఫస్ట్ టైం ఓ టీ షర్ట్, గ్రీటింగ్ కార్డు గిఫ్టుగా ఇచ్చిందని అన్నారు. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని.. మంచి కథ వస్తే తప్పకుండా ఇద్దరం కలిసి చేస్తామని అన్నారు. వీరిద్దరు కలిసి వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.