కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలరించారు. అప్పటికే బాలాజీ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బాలాజీ అకాల మరణం పట్ల సినీ ప్రపంచంలో సంతాపం తెలుపుతుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు డేనియల్ బాలాజీ. బుల్లితెరపై హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన బాలాజీ.. సినిమాల్లో మాత్రం ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు. ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బాలాజీ అంత్యక్రియలు ఈరోజు తన నివాసంలో జరగనున్నాయి.
డేనియల్ బాలాజీ 1975లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఆసక్తి ఉండడంతో తారామణి ఫిల్క్ కాలేజీలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఎప్పటికైనా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని డేనియల్ బాలాజీ కల.. కానీ ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. తారామణి కాలేజీలో శిక్షణ పూర్తైన వెంటనే అతడికి కమల్ హాసన్ నటించిన మరుదనాయకం సినిమాలో అవకాశం వచ్చింది. డైరెక్టర్ కావాలనే కోరికతో ఈ సినిమాకు చాలాకాలంపాటు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే అతడికి రాధిక శరత్ కుమార్ నటించిన చిత్తి.. (పిన్ని) సీరియల్లో అవకాశం వచ్చింది. అలా వెండితెర కంటే ముందు బుల్లితెరపై అరంగేట్రం చేశాడు. ఈ సీరియల్లో డేనియల్ పాత్రలో కనిపించాడు. అప్పటి నుంచి అతడిని డేనియల్ బాలాజీ అని పిలుస్తారు అభిమానులు.
ఆ తర్వాత అలలు సీరియల్లో నటించాడు బాలాజీ. ఈ సీరియల్ తర్వాతే అతడికి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో విలన్ గా కనిపించాడు. సాంబ, ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో కనిపించాడు. చివరగా న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించాడు డేనియల్ బాలాజీ. అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న డేనియల్ బాలాజీ.. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాక్టర్ అయినప్పటికీ డైరెక్టర్ కావాలనేది అతడి చిరకాల కల. ఆ కారణంగానే డేనియల్ బాలాజీ తారామణి ఫిల్మ్ కాలేజీలో చేరాడు. ఇక దర్శకుడిగా సినిమాకు దర్శకత్వం వహించాలని ప్రయత్నించిన డేనియల్ బాలాజీకి సరైన అవకాశాలు రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.