
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో చంద్రహాస్ ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ‘గుంజీ గుంజీ’ అనే సాంగ్ ను పాడుతూ అక్కడున్న అతిథులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పాటలోని లిరిక్స్ లో చాలా బూతులు ఉన్నాయి. ఇప్పుడదే వివాదానికి దారి తీసింది. సినీప్రముఖులతో పాటు మహిళలు హాజరైన కార్యక్రమంలో బూతు పాట పాడడంపై కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్ర హాస్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ చక్రవర్తి కూడా చంద్రహాస్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గుంజీ గుంజీ పాటపై వస్తోన్న విమర్శలకు చంద్రహాస్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో ఇలా చెప్పుకొచ్చాడీ యాటిట్యూడ్ స్టార్.
‘హాయ్.. అందరికీ నమస్కారం.. నేను స్టేజీ మీద పాడిన పాట ఇప్పుడు బాగా వైరలవుతోంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసే వాళ్లు బాగా ఎంజాయ్ చేయండి. అలాగని నచ్చని వాళ్లకు మాత్రం క్షమాపణలు చెప్పను. మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయా? అలా చూస్తే నా మనోభావాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి. ఎన్నో ఏళ్లుగా వందలు, వేళ్ల పదాలు నాపై వాడారు. ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో నన్ను దూషించారు. నా తప్పు లేకున్నా ట్రోల్ చేశారు. మరి ఈ పాటను విమర్శించిన వాళ్లంతా అప్పుడు ఏమైపోయారు? మీ మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదా? ఈ పాట సుమారు 3.5 నిమిషాలుంది. కానీ విమర్శకులు కేవలం 5 సెకన్లు క్లిప్ చూసి అసభ్యమంటున్నారు. తెలుగు సినిమాల్లో బీప్ సౌండ్‌లు సర్వసాధారణం. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందుకు క్షమాపణలు చెప్పను’ అని చెప్పుకొచ్చాడు చంద్రహాస్. తద్వారా తన పెర్ఫార్మెన్స్‌పై ఎలాంటి రిగ్రెట్ లేదంటూ స్పష్టం చేశాడీ యాటీట్యూడ్ స్టార్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొందరు చంద్రహాస్‌ను సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు అతనిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి ఈ ‘గుంజీ గుంజీ’ పాట వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..