తెలుగు చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత
తెలుగు చిత్రసీమలో ఇప్పటికే కృష్ణ, కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి పలువురు సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరి మరణాలను ఇంకా జీర్ణించుకోకముందే మరో తీవ్ర విషాదం నెలకొంది..
తెలుగు చిత్రసీమలో ఇప్పటికే కృష్ణ, కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి పలువురు సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరి మరణాలను ఇంకా జీర్ణించుకోకముందే మరో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన ప్రముఖ కళా రచయిత బాలమురుగన్ (86) ఆదివారం (జనవరి 15) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 8 గంటలకు 45 నిముషాలకు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన కుమారుడు భూపతి రాజా మీడియాకు వెల్లడించారు. బాలమురుగన్ మృతి పట్ల పలువురు తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
‘ధర్మదాత’, ‘ఆలుమగలు’, ‘సోగ్గడు’, ‘సావాసగాళ్లు’, ‘జీవన తరంగాలు’ వంటి ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. గీతా ఆర్ట్స్ తొలి సినిమా ‘బంట్రోతు భార్య’కి కూడా ఆయనే కథ అందించారు. శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ సినిమా టాలీవుడ్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి నేటికీ కల్ట్ స్టేటస్ కొనసాగిస్తోంది. ఇటువంటి ఎన్నో ఆణిముత్యాలకు కథలు ఆయన చేతి కలం నుంచి జాలువారినవే. దక్షిణాదిలో స్టార్ రైటర్‌గా వెలుగొందిన బాలమురుగన్.. తమిళలోనూ ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించారు. ఒక్క శివాజీ గణేషన్‌కే దాదాపు 30 నుంచి 40 సినిమాలకు కథలు అందించారు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.