AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

కస్తూరి శివరావు, తెలుగు సినీ హాస్యానికి ఆద్యుడు. 1940-50ల మధ్య కాలంలో హీరోల కంటే ఎక్కువ స్టార్‌డమ్‌ను అనుభవించారు. ఆయన హాస్యం, ప్రత్యేక శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దురలవాట్లు, ఆర్థిక సమస్యలు ఆయనను పతనానికి గురిచేశాయి. చివరికి నిస్సహాయ స్థితిలో విషాదకరంగా మరణించిన కస్తూరి శివరావు జీవితం ఎందరికో గుణపాఠం.

Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
Kasturi Siva Rao
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2026 | 5:58 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యాన్ని అద్భుతంగా పండించి, ప్రేక్షకులను అలరించిన నటులలో కస్తూరి శివరావుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రేలంగి, రాజబాబుల వంటి దిగ్గజాలకు ముందు తరంలోనే, శివరావు స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగారు. సుమారు ఒక దశాబ్దం పాటు ఆయన హాస్య సామ్రాజ్యాన్ని ఏలారు. ఆంధ్ర చాప్లిన్ అని కీర్తించబడిన శివరావు జీవితం వైభవం నుండి విషాదం వరకు సాగిన ఒక హృదయవిదారక గాథ. కాకినాడకు చెందిన మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కస్తూరి శివరావు ఇంటర్ వరకు చదువుకున్నారు. సినీ పరిశ్రమలోకి ఆయన ప్రవేశానికి దర్శక నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇంటర్ తర్వాత పుల్లయ్యగారి సిఫార్సుతో సినీ ఆపరేటింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై, తాడేపల్లిగూడెం, తుని, అనకాపల్లి, కాకినాడలోని థియేటర్లలో ఆపరేటర్‌గా పనిచేశారు. కొన్నాళ్ల పాటు మూకీ సినిమాలకు వ్యాఖ్యానం చెబుతూ తన హాస్య చతురతతో ప్రేక్షకులను అలరించారు. పుల్లయ్య గారు కలకత్తాలో చిత్రం నిర్మాణం ప్రారంభించినప్పుడు, శివరావును కూడా వెంట తీసుకెళ్లారు. భానుమతి తొలి చిత్రం వరవిక్రయంలో చిన్న వేషం, ఆ తర్వాత మాలతీ మాధవంలో హాస్య పాత్ర లభించాయి. 1941లో వచ్చిన చూడామణి చిత్రంలో శివరావు పోషించిన మంగలి శాస్త్రి పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. స్వర్గసీమ, ముగ్గురు మరాఠీలు చిత్రాలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తీసుకురాగా, అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాలరాజు చిత్రం ఆయనను స్టార్ కమెడియన్‌గా మార్చింది.

బాలరాజులో శివరావు పోషించిన ఎల్లమంద పాత్రను చూసి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారు. ఈ చిత్రం ఆంధ్రాలో రజతోత్సవం జరుపుకుంది, కాకినాడలోని మినర్వా టాకీస్‌లో ఏకంగా ఏడాది పాటు ఆడింది. ఆ సినిమాలో శివరావు పాడిన దేవుడయ్య దేవుడు పాట గ్రామఫోన్ రికార్డు విపరీతంగా అమ్ముడైంది. అప్పటి నుండి శివరావు స్టార్‌డమ్ మొదలైంది. గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీలక్ష్మమ్మ కథ వంటి ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన లేకుండా సినిమా లేదనే డిమాండ్ ఏర్పడింది. తెలుగులో బూతు డైలాగులకు ఆద్యుడిగా నిలిచారు.

హాస్యనటుడిగా పీక్స్‌కు చేరుకున్న తర్వాత, 1950లో పరమానందయ్య శిష్యులు చిత్రంతో దర్శకుడిగా మారారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ చిత్రంలో హాస్యనటీనటులందరూ ఉన్నప్పటికీ, చిత్రం ఫ్లాప్ అయింది. ఈ వైఫల్యం శివరావు పతనానికి నాంది పలికింది. అప్పటికే తాగుడుకు అలవాటు పడిన శివరావు, సినిమా ఫ్లాప్ అవడంతో మరింత వ్యసనాలకు బానిసయ్యారు. ఆస్తులు కరిగిపోవడం, అప్పులు పెరగడం, సినిమాలు తగ్గడంతో ఎప్పుడూ మత్తులోనే మునిగిపోయేవారు. ఆ సమయంలోనే రేలంగి హాస్యనటుడిగా పుంజుకున్నారు, శివరావుకు వచ్చే వేషాలు రేలంగికి వెళ్లడం మొదలైంది. ఒకప్పుడు ఖరీదైన బ్యూక్ కారులో తిరిగిన శివరావు, చివరి రోజుల్లో మళ్ళీ తన పాత వాహనం సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. శివరావు పక్క ఇల్లే కావడంతో ఎన్.టి. రామారావు ఆయనపై అభిమానంతో తన సొంత చిత్రాలు పాండురంగ మహాత్మ్యం, సీతారామకళ్యాణంలో వేషాలిచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు. తాగుడు మాన్పించాలని ప్రయత్నించినప్పటికీ, ఎన్.టి.ఆర్ కూడా విసిగిపోయారు.

చివరి రోజుల్లో దురలవాట్లతో పాటు ఆర్థిక సమస్యలు శివరావును అతలాకుతలం చేశాయి. పారితోషికాలు ఎగ్గొట్టిన నిర్మాతల మీద కోర్టు కేసులతో ఆయన మానసికంగా కుంగిపోయారు. 44 ఏళ్ళ వయసులోనే, 1966 ఫిబ్రవరి 25న తెనాలిలో శివరావు కన్నుమూశారు. ఆయన మరణం కూడా హృదయవిదారకమే. అర్ధరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్న శివరావును చాలాసేపు ఎవ్వరూ పట్టించుకోలేదు. మరునాడు వెంకట్రామయ్య అనే రంగస్థల నటుడు ఆయనను గుర్తించి, మృతదేహాన్ని మద్రాస్‌కు పంపించారు. దహన సంస్కారాలకు కూడా డబ్బు లేని స్థితిలో రేలంగి, జైహింద్ సత్యం, రాజబాబు, అల్లు రామలింగయ్య, పీకేట్ శివరాం వంటి వారు ముందుకొచ్చారు. మూడో రోజున అక్కినేని నాగేశ్వరరావు కూడా శివరావు ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి.. 

Follow Us