AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇప్పుడు మీరు చూస్తున్న రాజశేఖర్ వేరు.. ఒకప్పుడు రాజశేఖర్ వేరు..

తెలుగు చిత్ర పరిశ్రమలో డాక్టర్ రాజశేఖర్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కమర్షియల్ హీరోగా ఎదిగి, అంకుశం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు. వర్క్ పట్ల పూర్తిస్థాయి క్రమశిక్షణ ప్రదర్శించకపోవడం , ప్రమాదాలు ఆయన కెరీర్‌ను ప్రభావితం చేశాయి. జీవిత సపోర్ట్‌తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయినా, అప్పటి రేంజ్ అవకాశాలు తగ్గాయి.

Tollywood: ఇప్పుడు మీరు చూస్తున్న రాజశేఖర్ వేరు.. ఒకప్పుడు రాజశేఖర్ వేరు..
Rajasekhar
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2026 | 1:14 PM

Share

సినీ పరిశ్రమ నిజంగా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎప్పుడు పాతాళానికి పడేస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయినవారు ఉన్నారు. ఒక్క సినిమా తేడా కొడితే పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయినవారు ఉన్నారు. అందుకే ఎవరి నట జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ముందే ఊహించడం కష్టం. టాప్ పొజిషన్‌లో ఉన్న నటుడు తన కెరీర్‌ను ప్లాన్ చేసుకోవడంలో విఫలమైతే, కష్టపడి సంపాదించుకున్న స్థాయిలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకు ఒక ఉదాహరణ హీరో డాక్టర్ రాజశేఖర్ నట జీవితం. సాదాసీదా హీరోగా కెరీర్ ప్రారంభించి కమర్షియల్ హీరోగా ఎదిగి, ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన రాజశేఖర్, ఇప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం వేదికల మీద నుంచి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి రాజశేఖర్ పూర్తిగా క్రమశిక్షణతో వ్యవహరించకపోవడం ఒక కారణమని కొందరు వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతారు. ప్రారంభంలో రాజశేఖర్ చేసిన వందేమాతరం, అరుణకిరణం, ప్రతిఘటన వంటి చిత్రాలు ఆయనను ఒక స్థాయి చిత్రాలకే పరిమితం చేస్తాయని అందరూ భావించారు. కానీ తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకుని కమర్షియల్ హీరోగా ఎదిగారు. ఫేస్ వ్యాల్యూ, ఆర్టిస్టిక్ ఇమేజ్ వల్లే ఆయన సినిమాల బిజినెస్ ఆ రోజుల్లో చాలా వేగంగా జరిగేది. డాక్టర్ రాజశేఖర్ ఈ ఇమేజ్‌ను రాత్రికి రాత్రే సొంతం చేసుకోలేదు. కృషితో, పట్టుదలతో పైకి ఎదిగి వచ్చారు. డాక్టర్ రాజశేఖర్ కెరీర్ ప్రారంభం నుంచి సాఫీగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. దర్శకుడు టి.కృష్ణ శిక్షణలో నటన నేర్చుకున్న ఆయన, ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోగా తన స్థాయిని పెంచుకున్నారు.

ముఖ్యంగా అంకుశం చిత్ర విజయం రాజశేఖర్ నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. ఒకే తరహా చిత్రాలకే పరిమితం అనుకున్న వారి అభిప్రాయాన్ని మార్చి, ఆయనలోని పవర్‌ఫుల్ ఆర్టిస్ట్‌ను బయటపెట్టింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలంటే రాజశేఖర్ మాత్రమే చేయాలనే అభిప్రాయానికి ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల వారు వచ్చారు. మనసులోని ఆవేదన, ఆగ్రహం, అంతర్మథనం ఆయన ముఖంలో అద్భుతంగా పండుతాయి. నటనలో సహజత్వం ఉంటుంది. ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించి విడుదల చేసి అక్కడ కూడా విజయం అందుకున్నారు. మాస్ హీరోగా స్థిరపడాలనే రాజశేఖర్ కోరికకు అంకుశం ఘన విజయం మరింత ఊతం ఇచ్చింది. ఆ పంథాలో పయనిస్తున్న రాజశేఖర్ పై విధి కన్నెర్ర చేసింది. 1990లో ఆయన మగాడు చిత్రం షూటింగ్‌లో ఉండగా జరిగిన ప్రమాదం నటుడిగా ఆయన జోరుకు కళ్ళెం వేసింది. తీవ్ర ప్రమాదానికి గురవడంతో, ఇక రాజశేఖర్ బతికి బట్ట కట్టడం కష్టమని, ఒకవేళ బతికినా నటించడం కష్టమని అందరూ అనుకున్నారు. అప్పటికే రాజశేఖర్, జీవిత మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో రాజశేఖర్ మృత్యువుతో పోరాడి గెలిచి మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడానికి వైద్య సహాయంతో పాటు, జీవిత చేసిన సేవలు మరువలేనివి. ఈ ప్రమాదం వారిద్దరి మధ్య అనుబంధాన్ని మరింత పెంచడమే కాకుండా, జీవితను తన సహధర్మచారిణిగా చేసుకోవాలనే దృఢ నిర్ణయానికి రాజశేఖర్ వచ్చారు.

1991 జూలై 10న జీవిత మెడలో రాజశేఖర్ తాళి కట్టారు. పెళ్ళైన దగ్గర నుంచి రాజశేఖర్ కెరీర్ విషయంలో జీవిత అంతా తానై చూసుకున్నారు. కథలు విని ఫైనలైజ్ చేయడమే కాకుండా షూటింగ్ స్పాట్‌లో ఆమె తప్పనిసరిగా ఉండేవారు. ఒక దశలో ఇది విమర్శలకు కారణమైనా, రాజశేఖర్ తనకు జీవితాన్ని నిలబెట్టిన భార్యనే వెనకేసుకొచ్చేవారు. ఆయన ఒకే తరహా పాత్రలకు పరిమితం అవుతున్నారేమో అని అనుకుంటున్న తరుణంలో అల్లరి ప్రియుడు చిత్రంలో రాజశేఖర్‌ను కొత్తగా చూపించి కెరీర్‌కు మరో మలుపు తిప్పారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అల్లరి ప్రియుడు విజయం రాజశేఖర్‌కు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. దీని తర్వాత ఆయన ఇమేజ్‌తో పాటు పారితోషికం పెరిగింది. అలాగే ఆయన చిత్రాలకు మూడు కోట్ల రూపాయల బిజినెస్ విడుదలకు ముందే జరగడం మొదలైంది. బిజినెస్, పారితోషికం పెరగడంతో రాజశేఖర్ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. షూటింగ్‌లకు ఆయన ఆలస్యంగా వచ్చేవారని అప్పటి మేకర్స్ ఇప్పటికీ బాహాటంగా చెబుతూనే ఉంటారు. అనారోగ్యం అని కారణం చెప్పినా, దీని ప్రభావం ఆయన కెరీర్ మీద పడింది. రాజశేఖర్ వచ్చేవరకు దర్శకుడు సహా ఇతర నటీనటులు వేచి ఉండటం అసంతృప్తికి దారి తీసింది. క్రమంగా రాజశేఖర్ సినిమాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

కొత్త హీరోల ప్రవేశంతో పోటీ పెరగడం మరో కారణం. ఏడాదికి ఐదారు చిత్రాలు చేసే రాజశేఖర్‌కు ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టమైంది. విలన్ పాత్రలు చేయడానికి కూడా రాజశేఖర్ సంసిద్ధత వ్యక్తం చేసినా పరిశ్రమ నుంచి స్పందన కరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడిన రాజశేఖర్ 2020లో మరోసారి మృత్యుముఖం వరకు వెళ్లి బయటకు వచ్చారు. అందరూ ఆయన పని అయిపోయిందని అనుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన చూడ్డామని మంచి ఫిట్‌గా కనిపిస్తున్నారు. మద్యం తాగడం కూడా మానేసి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టినట్లు కనిపిస్తుంది. త్వరలో రాజశేఖర్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం..

Follow Us