బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో మెహ బూబ్ దిల్ సే ఒకడు. అంతకు ముందు పలు మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాక మరింత పాపులర్ అయ్యాడు. విజేతగా నిలవకున్నా తన ఆట తీరు, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక నటుడిగా కూడా మారాడు. పలు టీవీ షోలు, డ్యాన్స్ రియాల్టీ షోల్లోనూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే సోమవారం (జులై29) మెహబూబ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేశాడీ సోషల్ మీడియా సెన్సేషన్. అంతేకాదు అక్కడున్న పిల్లలందరికీ ఒక పూట మంచి భోజనం అందించి గొప్ప మనసును చాటుకున్నాడు. వారందరితో సరదాగ గడిపి ఫోటోలు కూడా దిగాడు. ఇక్కడి వరకు బాగానే ఉందీ కానీ.. తన పుట్టిన రోజు సంద్భంగా తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు మెహబూబ్. ఇప్పుడు ఇదే అతనిని చిక్కుల్లో పడేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన మెహబూబ్ బర్త్ డే పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు.. దీంతో మెహబూబ్‌తో పాటు రిసార్ట్ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలతో పాటు చాలా మంది యువతీ యువకులు పాల్గొన్నారు. అయితే రిసార్ట్‌లలోకి అనుమతి లేకుండా మద్యం తెచ్చుకుని సేవించడం నేరం అని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మెహ బూబ్ బర్త్ డే పార్టీలో 11 లీటర్ల మద్యంతో పాటు 7 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. అయితే ఈ పార్టీలో కొందరు మాత్రమే మద్యం సేవించారని పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ పదార్థాలు లేవని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మెహబూబ్ ఇచ్చింది రేవ్ పార్టీ అని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశం గురించి మెహబూబ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ బర్త్ డే పార్టీలో శ్వేతా నాయుడు, గీతు రాయల్, శ్రీ సత్య, విరూపాక్ష సేం రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి