తెలుగు తొలి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణించారు. రెండు రోజుల క్రితం గుండె నొప్పితో హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచినట్లు శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతిస్వరూప్ మృతితో పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆయన తెలుగులో వార్తలు చదివే సమయంలో ఎటువంటి టెలీప్రాంప్టర్ ఉండేది కాదు. కేవలం పేపర్ మీద రాసి ఉన్న వార్తలు చదివి వినిపించేవారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానెల్‌లో మొదటి సారిగా శాంతి స్వరూప్ తెలుగులో వార్తలు చదవడం మొదలు పెట్టి.. దాదాపు పదేళ్ల పాటు ఎటువంటి టెలీప్రాంప్టర్ లేకుండా స్పష్టంగా తెలుగులో వార్తలు చదివి వినిపించారు. న్యూస్ రీడర్‌గా చెరగని బుల్లి తెరపై చెరగని ముద్ర వేశారు. ఇంకా చెప్పాలంటే శాంతి స్వరూప్ పేరుని అప్పటి తరం నేటికీ గుర్తు చేసుకుంటారు. 2011లో పదవీ విరమణ చేశారు. అప్పటి వరకూ వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును శాంతి స్వరూప్ అందుకుంటారు. శాంతి స్వరూప్ మృతితో తెలుగు వార్తా ప్రసార రంగంలో ఒక శకం ముగిసినట్లు అయింది. లెజెండరీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్‌ను కోల్పోయినట్లు తెలుగు వార్తా ప్రసార ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. స్వరూప్ మరణం తెలుగు మీడియాకు మాత్రమే కాదు అందరికీ తీరని లోటు అని చెప్పారు.
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్‌గా శాంతి స్వరూప్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. 1983 నుంచి 2011లో పదవీ విరమణ చేసేంత వరకు సుదీర్ఘ కాలం పాటు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. శాంతి స్వరూప్ తెలుగు మీడియా రంగంలో చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..