Brahmamudi, November 11th Episode: చిచ్చు మొదలైందిగా.. ఆనందంలో అనామిక, రుద్రాణిలు..
కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడని తెలిసి.. ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆస్తులు ముక్కలు చేయాల్సిందేనని పట్టు బడుతుంది. కళ్యాణ్ వాటా కళ్యాణ్‌కు ఇచ్చి తీరాల్సిందేనని అంటుంది. ఎవరెన్ని చెప్పినా పట్టించుకోదు. ఈ క్రమంలోనే కాస్త సమయం కావాలి.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సీతారామయ్య ధాన్యలక్ష్మికి చెబుతుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నేను చచ్చినా కూడా ఈ ఇంటికి రాను. నా ఇంటికి వచ్చి నన్నూ, అప్పూని పిలిస్తే.. మా మీద ప్రేమతో అనుకున్నాం. కానీ ఇప్పుడే అమ్మ మనసులో ఏముందో పూర్తిగా అర్థమైంది. ఇంకెప్పుడూ ఎవరూ నన్ను ఈ ఇంటికి పిలవద్దని కళ్యాణ్ అంటాడు. రేయ్ నేను నీ మంచి కోరి చెబుతున్నా. ఇది నీతో పాటు ఉంటే నీ బ్రతుకు ఇలానే ఉంటుందని ధాన్యలక్ష్మి అంటుంది. అందుకని అనామికను వదిలించుకున్నట్టు నన్ను కూడా వదిలించుకోమని చెబుతున్నారా? ఇప్పుడు చెబుతున్నాను వినండి.. మీ కోట్ల ఆస్తి వద్దు.. మీరూ వద్దు. మీ కొడుకు గొడ్డు కారం పెట్టినా అమృతంలా తింటాను. కానీ కళ్యాణ్‌ని వదిలి ఎక్కడికీ పోను. ఇంది రెండో సారి మీరు నన్ను ఇంటికి పిలిచి అవమానించడం. ఇంకోసారి మీ కొడుకు వస్తానన్నా నేను రానివ్వను. పద కళ్యాణ్ అంటూ కళ్యాణ్, అప్పూలు వెళ్లిపోతారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా.. అవమానించి కొడుకు, కోడలు వెళ్లిపోయేలా చేశావని ప్రకాశం తిడతాడు. వాడు మన రక్తం పంచుకుని పుట్టిన కొడుకండి. పోనీ దేనితో అయినా పోనివ్వండి. కానీ వాడికి న్యాయం జరగాలని ధాన్యలక్ష్మి అంటుంది.
నాకు న్యాయం కావాలి.. నా కొడుకు వాటా ఇవ్వండి..
న్యాయం అంటే ఏం కావాలి? అని అపర్ణ అడిగితే.. ఆస్తులు ముక్కలు చేయండి. నా కొడుకు వాటా వాడికి ఇస్తే సంతోషంగా, దర్జాగా బ్రతుకుతాడని అంటుంది. ఇక్కడి దాకా వచ్చాక నేను ఊరుకునేదే లేదని ధాన్యలక్ష్మి బాధ పడుతుంది. నోర్ముయ్.. ధాన్యలక్ష్మి.. ఇదేమన్నా పిల్లల ఆటలు అనుకుంటున్నావా? ఇది తరతరాలుగా వస్తున్న ఉమ్మడి ఆస్తి. దీన్ని ముక్కలు చేయమనే అధికారం, హక్కు ఎవరికీ లేవని ఇందిరా దేవి అంటుంది. అవును అమ్మా.. రాజ్ మాత్రమే వారసుడుగా బ్రతకాలా? కళ్యాణ పేదవాడిలా బ్రతకాలా? ధాన్యలక్ష్మి మాట్లాడిన దానిలో తప్పేం ఉంది. రాజ్‌తో పాటు కళ్యాణ్, రాహుల్‌కి కూడా ఆస్తి పంచేయమని రుద్రాణి అంటే.. ఓహో అదా నీ ఆలోచనా.. అందుకా నువ్వు ధాన్యలక్ష్మిలో పుట్టిన స్వార్థాన్ని ఎగదోసేది.. అసలు ఎవరు నువ్వు? ఎందుకు నీకు ఆస్తి పంచాలి? చిల్లి గవ్వ ఇవ్వను.. ఇప్పటిదాకా మిమ్మల్ని చేరదీసిందే ఎక్కువ.. ఎక్కవు మాట్లాడితే మెడపెట్టి బయటకు గెంటేస్తానని ఇందిరా దేవి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది.
కావ్యని తీసిపారేసిన ధాన్యలక్ష్మి..
ఆపండి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు? మనం అందరం కళ్యాణ్, అప్పూని కోడలిగా ఒప్పుకున్నాం కదా.. అయినా వాడు రానంటే.. ఆస్తి ముక్కలు చేయడం ఏంటి? అని సుభాష్ అంటాడు. అందరూ ఇలా మాట్లాడే నా నోరు మూయిస్తున్నారు. నేను ఇంట్లోంచి బయటకు వెళ్లి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఇక నేను ఎవరి మాట వినిపించుకోను. ఆస్తిని సమానంగా పంచాల్సిందే.. కళ్యాణ్ వాటా కళ్యాణ్‌కు ఇవ్వాల్సిందేనని ధాన్యలక్ష్మి అంటుంది. వెళ్లవే వెళ్లు.. ఇంకా ఎందుకు నిలబడ్డావ్ అని ప్రకాశం అంటాడు. ప్రకాశం తప్పు.. ఏం మాట్లాడుతున్నావ్? ఇలా ఒక్కొక్కరిగా వెళ్లిపోవడానికి మనం ఏమన్నా ప్రయాణికులమా.. కొడుకు దీన స్థితి చూసి తల్లి తల్లడిల్లిపోవడం సర్వ సాధారణం. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలని సీతారామయ్య అంటాడు. చిన్న అత్తయ్యా మీకు ఎందుకు ఇలాంటి బుద్ధి పుట్టింది? మీ అబ్బాయి ఎక్కడికి పోతాడని కావ్య అంటుంది. నువ్వెవరు? నాకు నీతులు చెప్పడానికి మొగుడు వద్దు.. అత్త వద్దు అని పుట్టింట్లో ఉంటున్నదానివి నీకేం హక్కు ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. దీంతో అపర్ణ.. ధాన్యలక్ష్మికి ఇచ్చి పడేస్తుంది. ఆ తర్వాత సీతారామయ్య మాట్లాడుతూ.. అమ్మా ధాన్యలక్ష్మి ఇవన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసేవి కాదు.. కాస్త నాకు సమయం ఇవ్వమని అంటాడు.
అనామిక సంతోషం..
ఆ తర్వాత అదంతా తెలిసి అనామిక, సామంత్‌లు ఎంతో సంబర పడతారు. ఏం జరిగినా కూడా ఆ ముసలోడు ఆస్తులు పంచడు. దీంతో ధాన్యలక్ష్మి బయటకు పోతుంది. అప్పుడే ఆస్తులు పంచుకుని ఎవరి దారిన వాళ్లు పోతారని అనుకుంటూ సంతోషిస్తారు. ఆ తర్వాత కళ్యాణ్ బాధగా కూర్చుంటే.. నేను ముందు నుంచి చెబుతూనే ఉంటున్నా.. నువ్వు ఆటో నడపొద్దని.. నేను పిజ్జా డెలివరీ చేసినా మాకు పెద్దగా పరువు పోయేది ఏమీ లేదు. కానీ నువ్వు కోట్లకు వారసుడివి అయ్యి ఉండి.. ఆటో నడిపితే ఎలా ఉంటుందని అప్పూ అంటుంది. అంటే నాకు ఏమీ చేతకాదని ఒప్పుకోమంటావా అని కళ్యాణ్ అంటాడు. నేను ఉన్నాను కదా పని చేస్తానని అప్పూ అంటుంది. కానీ కళ్యాణ్ ఒప్పుకోడు.
ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతున్న రుద్రాణి..
మరోవైపు కావ్య టెన్షన్ పడుతుంది. ఆ ధాన్యలక్ష్మి అర్థం చేసుకోకుండా అరిస్తే నువ్వేం చేస్తావు? నీ మాట ఎవరైనా వింటారా? అని కనకం అడుగుతుంది. ఇప్పుడు ఈ సమస్యను నేను పరిష్కారం చూడకపోతే.. మళ్లీ ఎవరికి వారు బయటకు వెళ్లి ఆస్తులు ముక్కలు అవుతాయని కావ్య అంటుంది. అయినా అల్లుడు గారే ఇందులో జోక్యం చేసుకోవద్దని చెబితే.. నువ్వేం చేస్తావు? అని కనకం అంటే.. ఆయన కాదన్న మాత్రాన మా బంధం కాకుండా పోతుందా.. అక్కడ సమస్య కూడా నా సమస్యే. దాన్నే నేనే పరిష్కరిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఇలా చేసినంత మాత్రాన మా నాన్న ఆస్తులు పంచేస్తాడు అనుకుంటున్నావా? అని రుద్రాణి అడిగితే.. ఇవ్వక పోతే నేను ఊరుకోనని అంటుంది. కానీ ఆ కావ్య అది జరిగేలా చేయనిస్తుంది అనుకుంటున్నావా? కావ్య ఖచ్చితంగా అడ్డుపడుతుందని ధాన్యలక్ష్మికి ఎగదోస్తుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..