Babu Gogineni : దర్శకుడు, సినిమా క్రిటిక్ కత్తిమహేష్ కారు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కత్తిమహేష్ గతంలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. స్టార్ హీరోల సినిమాలపై కామెంట్లు చేయడంతోపాటు శ్రీరాముడి పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వివాదం పెద్ద దుమారాన్నే రేపింది. అయితే కత్తిమహేష్ చనిపోయిన తర్వాత కొంతమంది రాముడిని తిట్టినందుకే కత్తిమహేష్ చనిపోయాడంటూ కామెంట్లు కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ హేతువాది.. సైన్స్ ప్రచారకుడు బాబుగోగినేని పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ‘తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన నాస్తిక వాది బాబు గోగినేని.. దేశ ద్రోహులు ఒక్కొక్కరిగా రాలిపోతున్నారు.. జై శ్రీరామ్’ అంటూ బాబు గోగినేనిని పై రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు కొందరు. ఈ విషయం పై బాబుగోగినేని స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఇలా స్పందించారు.. నా తీవ్ర అనారోగ్యం గురించి వివరాలు తెలిసిన వారు కాస్త నాకు కూడా తెలియచేస్తే నాకు కొంచం ఊరటగా ఉంటుంది. దయ ఉంచి ఆ హాస్పిటల్ పేరు చెప్తే నేనే ఫ్రూట్స్, ఫ్లవర్స్ తో వెళ్లి అక్కడ నన్ను నేను పరామర్శించుకుంటాను. 6 సంవత్సరాల క్రిందటే నేను చనిపోయాను అని ప్రకటన చేసిన వారు, నన్ను లేపేస్తాము అని మెసేజ్లు పంపే వారు, ఈ సారి దయ ఉంచి నన్ను ఈ మరణానంతర జీవితంలో ఆసుపత్రిలో చేర్చడం అన్నది ఆహ్వానించదగిన పరిణామమే.
కాకపోతే నన్ను నాస్తిక వాదిగా కాకుండా మానవవాదిగా, హేతువాదిగా, సైన్స్ ప్రచారకుడిగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా, ఒక టీచర్ గా, ఒక మంచివాడిగా, మిత్రుల పట్ల విధేయుత ఉన్న, ఎంతటి లాఫూట్ గాడి మోసాన్నైనా నవ్వుతూ పట్టించగలిగిన, ఎంతటి వాళ్ళని అయినా ధైర్యంగా ఆట పట్టించగలిగిన, తను నవ్వి ఇతరులను నవ్వించగలిగిన, పుట్టిన దేశానికే పరిమితం కాకుండా స్వేచ్ఛా జీవిగా, విశ్వ మానవుడిగా అనేక భాషలలో, అనేక దేశాలలో జీవించిన హ్యూమనిస్ట్.. హ్యూమరిస్ట్ గా గుర్తుంచుకోవలసినదిగా ప్రార్థన.
మీకు గుర్తు ఉండకపోయినా చాలా మందికి చాలా దేశాల్లో చాలా చోట్ల బాగా తగిలి ఉన్నందున, మనస్సు, ఈగో, వ్యాపారం బాగా దెబ్బతిని వాచి ఉన్నందున వారు మాత్రం గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికీ మర్చిపోలేరు, కోలుకోలేరు అన్న సంతృప్తి మాత్రం వాళ్ళు పోయాక కూడా మిగిలే ఉంటుంది. నాకు.
ఇక పోతే, నేను ఇప్పుడు గానీ, ఇంకెప్పుడైనా సరే, పోయినాక మూడు రోజులు కూడా ఆగకుండా మళ్లీ వస్తానని, ఈ సారి దయ్యం అయ్యి మరీ అలుపెరగకుండా పేడ పురుగులను పీడించుకు తింటాను అనీ మరొక్క సారి నా మరణానంతర జీవితం వారికే అంకితం అని జాతికి తెలియజేసుకుంటున్నాను. నేను లేకపోయినా నా మేధో మిత్రులు సహచరులు ఉంటారనీ, వాళ్ళు నా కంటే అదుర్స్ అనీ గుర్తుచేస్తున్నాను… అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :