ఆ హీరో నాకు చాలా చాలా స్పెషల్.. ఆయనతో కలిసి 45 సినిమాలు చేశా: నటి జయప్రద
సినీయర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయప్రద తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి తాను నటించిన హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సీనియర్ నటి జయప్రద తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎంతో మంది గొప్ప నటులు, దర్శకులతో పనిచేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌లోని ముఖ్యమైన ఘట్టాలను, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా, సూపర్ స్టార్ కృష్ణ గారితో తన అనుబంధం గురించి ఆమె వివరంగా మాట్లాడారు. కృష్ణ గారితో కలిసి 45 చిత్రాలలో నటించినట్లు జయప్రద గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారు కేవలం గొప్ప నటుడు, దర్శకుడే కాకుండా, తన జీవితంలో తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. తామిద్దరం కలిసి ఎన్నో మంచి క్యారెక్టర్లలో నటించామని, ఆయన గొప్ప మనిషి అని కొనియాడారు. కృష్ణ గారితో 45 సినిమాలు చేయడం ఒక హీరోతో అంత ఎక్కువ సంఖ్యలో నటించడం తనకెంతో గర్వకారణమని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత తరం నటులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లతో తనకున్న అనుబంధం గురించి కూడా జయప్రద ప్రస్తావించారు. మహేష్ బాబు ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ తన పట్ల గొప్ప గౌరవాన్ని చూపిస్తారని ఆమె తెలిపారు. శోభన్ బాబు గారు తనను అత్త అని పిలిచే ఆప్యాయతను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
తన సినిమాలు తాను చూసుకోవడం పట్ల జయప్రద తన భయాన్ని పంచుకున్నారు. “నేను చాలాసార్లు నా సినిమా నేనే చూసుకోవడానికి భయపడతాను. అమ్మో తర్వాత షాట్ ఎలా ఉంటానో, ఎలా ఉన్నానో, నా జుట్టు ఎలా ఉందో, నా చీర ఎలా ఉందో అని ఆలోచిస్తాను” అని అన్నారు. అందరూ బాగుందని చెప్పిన తర్వాతే మళ్లీ చూస్తానని, ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా టెన్షన్ ప్రతి షాట్ లో ఉంటుందని తెలిపారు. బహుశా అదే తన కమిట్‌మెంట్‌కు కారణమేమో అని ఆమె అన్నారు. దర్శకులు కె. బాలచందర్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన తన తమిళ వెర్షన్ సుజాత సినిమాను చూపించినప్పుడు, అందులో సుజాత పాత్రను చాలా బాగా చేసిందని, ఆ పాత్ర చూసి తాను ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తానో అని భయపడ్డానని అన్నారు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా గెటప్ మార్చి, పెద్ద లుక్ వచ్చేలా హెయిర్ బన్స్, రెండు పెట్టీకోట్లు, హీల్స్ వేయించారని గుర్తు చేసుకున్నారు. ఆ పాత్ర త్యాగానికి ప్రతీక అని, ఆ సినిమాలోని “కళ్ళలో ఉన్నదేదో కనులకే తెలుసు” అనే ఆత్రేయ గారి పాట వింటే ఇప్పటికీ కళ్ళలో నీళ్లు వస్తాయని జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబాన్ని కాపాడటానికి ఆ పాత్ర చేసిన త్యాగం అద్భుతమని, దాని హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు.
దర్శకులు దాసరి నారాయణ రావు గారితో తనకున్న అనుబంధం గురించి కూడా జయప్రద పంచుకున్నారు. ఆయన తనకు చాలా మంచి సినిమాలు ఇచ్చారని, మేఘ సందేశం వంటి చిత్రాలు తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, “దేవుడే దిగి వస్తే” సినిమాలో ఒక స్విమ్మింగ్ పూల్ సన్నివేశం కోసం బికినీ వేసుకోవలసి వచ్చిందని, అప్పుడు చిన్నపిల్లనైన తాను వేసుకోనని చెప్పి చాలా ఏడ్చానని అన్నారు. దాసరి గారు మళ్లీ వచ్చి, “ఏమైంది? నీకేమీ కనపడదులే, వేసుకుని రా” అని చెప్పి, టైర్‌లో కూర్చోబెట్టి ఆ సన్నివేశాన్ని తీశారని చెప్పారు. ఆ తర్వాత తాను బికినీ సాంగ్, బికినీ డ్రెస్ వేసుకోకూడదని మానసికంగా నిర్ణయించుకున్నానని, అది తప్పని కాదు కానీ తాను కంఫర్టబుల్‌గా లేనని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 30 ఏళ్లుగా ఒక్క షాట్‌లో కూడా ఏ సినిమాలోనూ బికినీ వేయలేదని జయప్రద గర్వంగా చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




