మొదటిసారి టాప్ హీరోతో శేఖర్ కమ్ముల..!
టాలీవుడ్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంది. కమర్షియల్ అంశాలకు దూరంగా మనసుకు హత్తుకునే సినిమాలను తీయడంలో ఈ దర్శకుడు దిట్ట
టాలీవుడ్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంది. కమర్షియల్ అంశాలకు దూరంగా మనసుకు హత్తుకునే సినిమాలను తీయడంలో ఈ దర్శకుడు దిట్ట. అంతేకాదు ఇంతవరకు కొత్త వారితోనో లేక యంగ్ హీరోలతోనే ఈ దర్శకుడు ‘సినిమాలు తీస్తూ వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం అన్నీ కుదిరితే ఈ దర్శకుడు తొలిసారి టాప్ హీరోను డైరెక్ట్ చేయనున్నారు. ఇంతకు ఎవరా స్టార్ హీరో అంటే విక్టరీ వెంకటేష్.
ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏషియన్ సినిమాను నిర్మిస్తోంది. దాదాపుగా ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. అయితే ఏషియన్ బ్యానర్‌లోనే తన తదుపరి సినిమా ఉంటుందని ఆ మధ్యన ప్రకటించిన శేఖర్ కమ్ముల.. ఇప్పటికే ఓ కథను రాశారట. ఇక ఈ కథ ఏషియన్ నిర్మాతలకు నచ్చేయగా, వారు సురేష్ బాబుకు చెప్పడం, ఆయనకు నచ్చేయడం జరిగిందని సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే శేఖర్ కమ్ముల వెంకటేష్‌ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్టోరీ వెంకటేష్‌కి నచ్చుతుందా..? లేదా..? వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా..? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం వెంకటేష్, నారప్ప(తమిళంలో విజయం సాధించిన అసురన్ రీమేక్)చిత్రంలో నటిస్తుండగా.. ఎఫ్ 2 సీక్వెల్‌లో నటించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.