
వెర్సటైల్ యాక్టర్ సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విమానం. మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ చిత్రంలో సముద్ర ఖని వికలాంగుడి పాత్రలో కనిపించనున్నాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాలే ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జూన్ 9వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రోమో పేరుతో ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ప్రోమోను గమనిస్తే తండ్రీ కొడుకల మధ్య అనుబంధాన్ని ఎమోషనల్‌గా చూపించారు. భార్యలేకపోయినా కొడుకును జాగ్రత్తగా చూసుకునే తండ్రి పాత్రలో సముద్ర ఖని అద్భుత నటనను కనబరిచారు. జీవితంలో ఎప్పటికైనా విమానం ఎక్కాలని ఆశపడే కుర్రాడికి, తండ్రికి మధ్య జరిగిన సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా అలనాటి అందాల తార మీరా జాస్మిన్ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రోమో విడుదల సందర్భంగా జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ క్రేజీవాల్ మాట్లాడుతూ.. ‘కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావటం చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి నటీనటులు, టెక్నీషియన్స్ టీమ్‌గా ఏర్పడి భావోద్వేగాల కలబోతగా బలమైన కథాంశంతో రూపొందిన విమానం ప్రేక్షకులను మెప్పిస్తుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..