
నిడివి, గ్లామర్ కాదు.. పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలకు ఓకే చెప్పే హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. అందుకే ఈ నటి ఇంతవరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం అన్నీ కుదిరితే ఈ మలార్ బ్యూటీ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. చిరు, చెర్రీ ఇందులో గురు శిష్యులుగా కనిపించనుండగా.. చెర్రీ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చెర్రీకి హీరోయిన్‌తో పాటు ఓ పాటను కూడా పెట్టాలని కొరటాల భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో రష్మిక, కియారా, అలియా ఇలా పలువురి పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. నక్సలైట్‌గా ఆమె పాత్ర ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే విరాట పర్వంలో సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపిస్తుండగా.. మరోసారి ఆ పాత్రకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
కాగా ఆచార్య మూవీలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. సోనూసూద్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.