రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిన్న రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న ట్రైలర్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా ట్రైలర్ చూసిన కొంతమంది ఈ సినిమా స్టోరీలైన్ హాలీవుడ్ సినిమా ‘నైట్ అండ్ డే’కు పోలిక ఉందని అంటున్నారు.
టామ్ క్రూస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమాను బాలీవుడ్లో యాక్షన్ హీరో హృతిక్ రోషన్ హీరోగా ‘బ్యాంగ్ బ్యాంగ్’ అనే టైటిల్‌తో తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీలైన్‌కు ‘సాహో’ స్టోరీ దాదాపు మ్యాచ్ అవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ మూవీస్ స్టోరీ లైన్స్ అన్ని ఒకేలా ఉండడం కామన్.. కానీ కథనంలో కొత్తదనం ఉంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.’బ్యాంగ్ బ్యాంగ్’ మూవీలో హృతిక్ నటనను.. ‘సాహో’లో ప్రభాస్ పాల్గొన్న షూట్ సీన్స్‌ను పోల్చుకున్నప్పుడు సారూప్యాలు స్పష్టంగా కనబడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోకుండా తమ బాస్ ట్రైలర్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.