
అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో నటుడు దర్శన్, నటి సవిత్రా గౌడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వారికి మంజూరైన బెయిల్ కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో గంటల వ్యవధిలోనే వీరిద్దరినీ బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను బళ్లారి జైలులో ఉన్న ఆయన మునుపటి జైలుకు మార్చాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టు బుధవారం (సెప్టెంబర్ 3) విచారించింది. అయితే ఈరోజు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కోర్టు హాలులోకి చొరబడి కొంతసేపు గందరగోళం సృష్టించాడు.
బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో వాదనలు జరుగుతుండగా అనామక వ్యక్తి తన చేతిలో ఓ పిటిషన్ పట్టుకుని కోర్టు గదిలోకి ప్రవేశించాడు. అభిమానిని చంపిన దర్శన్, ఈ కేసులో సంబంధం ఉన్న ఇతర నేరస్తులకు బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయమూర్తిని అభ్యర్థించాడు. అనంతరం దర్శన్‌కు మరణశిక్ష విధించాలని న్యాయమూర్తిని అభ్యర్థించాడు. ఈ ఊహించని పరిణామంతో అయోమయంలో పడిన న్యాయమూర్తి.. ‘నువ్వు ఎవరు?’ అని అడిగాడు. ఆ వ్యక్తి తాను రవి బెలగెరె కొడుకు అని జవాబిచ్చాడు. వెంటనే న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎవరో సమర్పించిన దరఖాస్తును తాను అంగీకరించలేనని అన్నారు. కేసు ఏదైనా సరే, ఆ వ్యక్తి పిటీషన్‌కు దరఖాస్తు తీసుకుంటేనే స్వీకరిస్తామని చెప్పారు. న్యాయమూర్తి సూచన తర్వాత సదరు వ్యక్తి కోర్టు గది నుంచి వెళ్లిపోయాడు. దీంతో గందరగోళం సర్దుమనిగింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారం జరగాలని, బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కాగా కర్ణాటకలో సంచలనం రేపిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నటి పవిత్రకు అసభ్య సందేశాలు పంపాడన్న నెపంత.. మృతుడు రేణుకా స్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.