కథ నచ్చక సినిమాను వదులుకుంటుంటారు కొందరు. మరికొందరేమో కథ నచ్చినా.. డేట్లు అడ్జెస్ట్ చేసుకోలేక దర్శకులకు సారీ చెబుతుంటారు. కానీ నాచురల్ స్టార్ నాని మాత్రం రవితేజ కోసం సినిమాను వదులుకున్నారట. ఇప్పుడు ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ వర్గాల ప్రకారం.. దర్శకుడు త్రినాధరావు నక్కిన నానికి ఓ కథను చెప్పారట. ఆ కథను విన్న నాని.. అందులో నటిస్తానని అన్నారట. అయితే ఈ సంవత్సరానికి గానూ నాని డైరీ ఫుల్ అయ్యింది. మరోవైపు త్రినాధరావు అన్ని రోజులు వెయిట్ చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఏడాదిన్నరగా ఆయన ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ కథ రవితేజకు బాగా సెట్ అవుతుందని భావించిన నాని.. ఆ విషయాన్ని త్రినాథరావుకు చెప్పారట. ఇక రవితేజకు కూడా ఈ కథను వినమని నాని సూచించారట. దీంతో త్రినాధరావు, మాస్‌రాజాకు కథ చెప్పడం.. రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. అటు తనకు హిట్ ఇచ్చిన త్రినాధరావును నొప్పించడం ఇష్టం లేకపోవడం.. ఇటు రవితేజతో ఉన్న స్నేహబంధం కారణంగానే నాని ఈ ప్రాజెక్ట్‌ను వదలుకున్నట్లు సమాచారం. ఇక పీపుల్స్ మీడియా నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం.
కాగా ఈ ఏడాది డిస్కో రాజాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం కూడా ఆయనను నిరాశపరించింది. దీంతో వరుస ఫ్లాప్‌లతో ఆయన మరోసారి సతమతమవుతున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ చిత్రంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా మిగిలిన హీరోలు వదులుకున్న సినిమాలు రవితేజకు బాగా అచ్చొస్తుంటాయి. మరి అలాగే నాని వదులుకున్న ఈ చిత్రం రవితేజకు విజయాన్ని ఇస్తుందేమో చూడాలి.