Tollywood: టాలీవుడ్‌ పెద్దన్న ఆయనే.. మనసులో మాట బయట పెట్టిన అగ్ర దర్శకుడు..

| Edited By: Narender Vaitla

Mar 20, 2022 | 6:16 PM

Tollywood: 'ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు నచ్చదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉండాలనుకుంటారు. ఆ బిడ్డకు ఇప్పుడు ఇండస్ట్రీ అంతా రుణపడి ఉంది'.... కన్నడ సీమలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదిక సాక్షిగా రాజమౌళి అన్న మాటలివి. జక్కన్న ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి అన్నారో..

Tollywood: టాలీవుడ్‌ పెద్దన్న ఆయనే.. మనసులో మాట బయట పెట్టిన అగ్ర దర్శకుడు..
Follow us on

Tollywood: ‘ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు నచ్చదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉండాలనుకుంటారు. ఆ బిడ్డకు ఇప్పుడు ఇండస్ట్రీ అంతా రుణపడి ఉంది’…. కన్నడ సీమలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదిక సాక్షిగా రాజమౌళి అన్న మాటలివి. జక్కన్న ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి అన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మనసున్న స్టార్‌.. అందుకే మెగాస్టార్‌ అయ్యారనే మాటను కాస్త గట్టిగానే చెప్పారు రాజమౌళి. అసలే కన్నడ గడ్డ. అందులోనూ మెగాస్టార్‌ గురించి గొప్పగా చెప్పిన మాటలు. అభిమానులు అంత తేలిగ్గా వదులుతారా? కరతాళ ధ్వనులతో, జై మెగాస్టార్‌ నినాదాలతో ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేశారు. ఇద్దరు స్టార్‌ హీరోలు, కన్నడ సీఎం ముందు రాజమౌళి మనసారా చెప్పిన మాటలు నిజంగానే ఇండస్ట్రీని ఆలోచింపజేస్తున్నాయి.

పది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూ జీఓ ఇవ్వగానే ‘ఇదేదో సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా లేదు’ అనే భావం చాలా మందిలో కనిపించింది. కానీ కాగల శుభకార్యానికి పసుపు దంచే తంతుకి ముందుండేదెవరు? చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ మెగాస్టార్‌ వేసిన ఒక్కడుగు మాత్రం మంచి ఫలితాన్నిచ్చింది. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో, సత్సంబంధాలతో చిరంజీవి ముందుకు నడిచారు. ఇండస్ట్రీ తరఫున వెళ్లడానికి చాంబర్లు, కౌనిళ్లు ఉండగా ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే మాటలు వినిపించాయి? దాసరికి చిరంజీవి ప్రత్యామ్నాయమవుతారా? పెద్దన్న పాత్రను పోషిస్తున్నారా? అనే చర్చలూ బలంగానే నడిచాయి. ‘ఆయన్ని చాలా మంది చాలా మాటలన్నారు. రకరకాల మాటలన్నారు. కానీ మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలు పడ్డారు’ అన్న రాజమౌళి మాటలను గమనిస్తే, ఈ ఇష్యూ గురించి ఎంతగా చర్చ జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న రాజమౌళి స్వయంగా ఒప్పుకున్నాక, స్టార్‌ హీరోలు, అభిమానులు ఒప్పుకున్నాక… మెగాస్టార్‌ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పెద్దన్న కుర్చీ ఆయనకే సొంతం. బిడ్డగా ఉంటానని వినమ్రంగా చెప్పినప్పటికీ, ‘పెద్ద’ అనే మాట మీద… ఆయన మనసు నొచ్చుకోవడానికి కారణమైన వారి మీద మాత్రం చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో సరకులు పంచడం, టీకాలు వేయించడం, వైద్య పరీక్షల కోసం ల్యాబ్‌లతో మాట్లాడిపెట్టడం, ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం చేసిన కృషి… ఒకటేంటి? ఇండస్ట్రీకి మెగాస్టార్‌ తరఫున కలిగిన లాభాలను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు.

ఇటీవల తెలంగాణలో టిక్కెట్‌ రేట్లను పెంచుకునే వెసులుబాటు కలిగించడంలో చిరు కృషి ఉందని తెలిసిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయనికి మూకుమ్మడిగా బిగ్‌ బాస్‌ హోదాను కట్టబెట్టేసింది. నాగార్జున, వెంకటేష్‌, మహేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా స్టార్‌ హీరోలందరి సపోర్టు ఎలాగూ ఆయనకే. ఇటు డైరక్టర్లయితే అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ ఆయన వెంటే ఉన్నారు. కష్టకాలంలో ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలుచుని, అన్నీ అవసరాలను తీర్చారని సినీ కార్మిక లోకం సదా స్మరించుకుంటోంది. అన్ని మార్గాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ పాజిటివిటీని పెంచిన మెగాస్టార్‌… ఇండస్ట్రీ బిడ్డగా ఒదిగి ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ పెద్ద అనే కిరీటం ఆయనకు పెట్టకనే పెట్టేసింది సినీలోకం!

Also Read: Chicken Prices: ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్.. రేటు తెలిస్తే ముద్ద దిగడమూ కష్టమే

The Kashmir Files: సినిమా చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటున్నారు.. ఆసక్తికర విషయం తెలిపిన కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత

India-Sri Lanka: చైనాతో సఖ్యతగా ఉన్నా.. శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మిత్ర దేశాన్ని ఆదుకునేందుకు..