Jana Nayagan OTT: మిక్స్‌డ్ టాక్‌తోనే 300 కోట్లు.. అప్పుడే ఓటీటీలోకి విజయ్ ‘జన నాయగన్’! స్ట్రీమింగ్ డేట్ ఇదే
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' గా రిలీజైంది. జులై 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితేనేం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది.

తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు తీసిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు). మాస్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ముందు నుంచి భారీగా ఆశలు పెట్టుకున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై చర్చ జరిగింది. అయితే ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యలతో అనూహ్యంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా హెచ్ డీ ప్రింట్ పైరసీలో రావడంతో దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు. ఇలా ఎన్నో అడ్డంకులను దాటి జులై 23న థియేటర్లలో రిలీజైన జన నాయగన్ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది కానీ ఇతర చోట్ల ఈ సినిమాకు నెగెటివ్ టాకే ఎక్కువగా వచ్చింది. అయినా విజయ్ అభిమానులు ఈ సినిమాను తెగ చూసేశారు. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఇప్పటివరకు జన నాయగన్ సినిమాకు సుమారు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న విజయ్ జన నాయగన్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 21 నుంచే జన నాయగన్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన జన నాయగన్ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ రోల్ పాత్రలో ఆకట్టుకున్నారు. వీరితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, రేవతి, హాస్య నటుడు సునీల్, నాజర్ వంటి స్టార్స్ ఈ మూవీలో మెరిశారు. అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
జన నాయగన్ సినిమా ట్రైలర్ తెలుగులో.,
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




