777 Charlie Movie: అతడే శ్రీమన్నారాయణ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty). అతను నటించిన తాజా చిత్రం 777 చార్లి (777 Charlie). ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చక్కగా, హృద్యంగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు కె. కిరణ్ రాజ్. కన్నడతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతూ భారీ కలెక్షన్లను రాబడుతోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి అద్భుతంగా ఉందటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఈ మూవీని చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తన పెట్‌డాగ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్లలో అలరిస్తోన్న ఈ ఎమోషనల్ మూవీ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
777 చార్లి సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆగస్టు రెండో వారం నుంచి డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులో రానుందని సమాచారం. కాగా 777 చార్లి ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..