“కుడి ఎడమైతే” వెబ్ సిరీస్ రివ్యూ..
నటీనటులు: అమలాపాల్, రాహుల్ విజయ్, రవిప్రకాశ్, రాజ్ ముదిరాజ్, తదితరులు
దర్శకుడు: పవన్ కుమార్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
రచన: రామ్ విఘ్నేష్
తెలుగు ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త సినిమాలను అందిస్తూ దూసుకుపోతుంది తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం “ఆహా”. బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు.. సస్పెన్స్ యాక్షన్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఎన్ని చిత్రాలను డిజిటల్ ప్రేక్షకులకు అందించిన ఆహా.. తాజాగా మరో సరికొత్తగా.. “కుడి ఎడమైతే” ప్రెస్టీజియస్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటించగా.. లూసియా, యూటర్న్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సెన్సెషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్, పోస్టర్స్లతో ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించిన “కుడి ఎడమైతే” సిరీస్ ఈరోజు (జూలై 16న) “ఆహా”లో అందుబాటులోకి వచ్చింది. మరీ ఈ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలుసుకుందామా.
కథ..
ఆది (రాహుల్ విజయ్) హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. ఇక దుర్గా (అమలా పాల్) ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తుంటుంది. అయితే వీరిద్దరి జీవితాల్లో ఒకే రోజు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదే ఫిబ్రవరి 29. ఈ రోజునే వారిద్దరు చనిపోవడం.. మళ్లీ మరుసటి రోజు ఏమి జరగనట్టుగా యధావిధిగా వాళ్ల రోజు స్టార్ట్ అవుతుంది. కానీ.. ముందు రోజు ఏదైతే జరిగిందో అదే సన్నివేశాలు మళ్లీ మళ్లీ జరుగుతుంటాయి. ఇక వీళ్లిద్దరు చనిపోవడానికి ముందు రోజు ఒక అమ్మాయి, చిన్న అబ్బాయి కిడ్నాప్ అవుతారు. అలాగే ఆది స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోతాడు. అయితే సిటీలో జరుగుతున్న వరుస కిడ్నాప్‌లను ఆపడానికి.. దుర్గా, ఆది ప్రయత్నిస్తుంటారు. అయితే వీరి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా ? వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి సన్నివేశాలు జరిగాయి.. ఆది, దుర్గా ఎలా కలుసుకున్నారు ? అసలు వీరిద్దరికి ఉన్న కనెక్షన్ ఏంటీ ? అనే విషయాలను పూర్తిగా సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ..
ఇక కుడి ఎడమైతే సిరీస్ చూస్తున్నంత సేపు.. ప్రేక్షకులను ఏం జరుగుతుంది ? ఆ తర్వాత జరిగే పరిణామం ఏంటీ ? అసలు ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు ? దుర్గా, ఆది ఎలా అడ్డుకుంటారు ? అని ఆసక్తిని ప్రేక్షకులకు కలిగించడంలో పవన్ కుమార్ మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే కుడి ఎడమైతే మొదటి సీజన్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లున్నాయి. ఇప్పటికే లూసియా.. యూటర్న్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు ఊహకు అందని కాన్సెప్ట్స్‌ను టిపికల్‌గా డీల్ చేయడంలో పవన్ నేర్పరి అనుకోవచ్చు. ఇక కుడి ఎడమైతే… సిరీస్.. ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తూనే.. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
ఇక సిరీస్ మధ్యలో వచ్చే మలుపులతో ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించాడు డైరెక్టర్. రామ్ విఘ్నేష్ రాసిన కథను పవన్ కుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అనుక్షణం సస్సెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా చేసింది. ఆది.. దుర్గ కలిసి తమ ఇద్దరికీ ఒకే రకమైన అనుభవం ఎదురైందని గుర్తించి ఒకరికొకరు సాయం చేసుకుంటూ రహస్యాలను ఛేదించేందుకు .. అలాగే ముందు రోజు జరిగిన దారుణాలను ఆపేందుకు ప్రయత్నించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. చివరి మూడు ఎపిసోడ్లలో కథనం మంచి ఊపుతో సాగుతుంది. చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోతాయి. చివరి ఎపిసోడ్లో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.
దుర్గా పాత్రలో అమలాపాల్ జీవించేసింది. ఇక రాహుల్ విజయ్ కూడా తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటించాడు. ఇక భయంకరమైన కిడ్నాపర్ పాత్రలో రవి ప్రకాష్ .. ప్రేక్షకులను మరోసారి భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కరి పాత్రలో వారు జీవించేశారని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా ముగింపును ఆసక్తికరంగా చిత్రీకరించడంలో డైరెక్టర్ పవన్ విజయం సాధించాడు. మొత్తానికి కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్‌ను అందించారు రచయిత.. దర్శకుడు.
ఇక సాంకేతికంగా చూసుకుంటే.. సిరీస్‌లో వచ్చే సన్నివేశాలకు అనుగుణంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు పూర్ణచంద్ర తేజస్వీ. అలాగే ఛాయాగ్రహణం.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌ల కాన్సెప్ట్, కంటెంట్ పరంగా కుడి ఎడమైతే ది బెస్ట్ అనడంలో సందేహం లేదు. మొత్తానికి లాక్డౌన్ కారణంగా.. కొత్త వినోదానికి విరామం రావడంతో.. ప్రేక్షకులను “కుడి ఎడమైతే” సిరీస్ థ్రిల్లింగ్ రైడ్ అందించింది.
చివరగా..
ఎన్నో మలుపులతో “కుడి ఎడమైతే”.. అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లింగ్..
ట్రైలర్..
Also Read: Anupama Parameswaran: ఆటలో మునిగిపోయానంటున్న అనుపమ పరమేశ్వరన్.. బానిసయ్యానంటూ షాకింగ్ కామెంట్స్..
Shanmukh Jaswanth: కొత్త లగ్జరీ కారు కొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..