Tribanadhari Barbarik Review: త్రిబాణధారి బార్బరిక్ బార్బరిక్ రివ్యూ.. సత్యరాజ్ సినిమా ఎలా ఉందంటే

Tribanadhari Barbarik Review: త్రిబాణధారి బార్బరిక్ బార్బరిక్ రివ్యూ.. సత్యరాజ్ సినిమా ఎలా ఉందంటే
Tribanadhari Barbarik
Tribanadhari Barbarik
UA
  • Time - 108 Minutes
  • Language - Telugu, Tamil, Hindi
  • Genre - fantasy thriller
Cast - Sathyaraj, Sanchi Rai · Motta Rajendran · Vasishta N. Simha · Prabhavathi · VTV Ganesh · Satyam Rajesh · Meghana · Udayabhanu.
Director - Mohan Srivatsa

Edited By: Rajeev Rayala

Updated on: Aug 29, 2025 | 10:43 AM

మూవీ రివ్యూ: త్రిబాణధారి బార్బరిక్

నటీనటులు: సత్యరాజ్, సత్యం రాజేష్, మేఘన, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, వీటివి గణేష్, సాంచి రాయ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: కుశేందర్ రమేష్ రెడ్డి

ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్

సంగీతం: ఇన్ఫ్యూజన్ బ్యాండ్

నిర్మాత: అడిదల విజయపాల్ రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మోహన్ శ్రీవత్స

కథ:

డాక్టర్ శ్యామ్ (సత్యరాజ్) పేరు మోసిన సైకియాట్రిస్ట్. ఆయన ప్రాణం మొత్తం మనవరాలు నిధి (మేఘన) మీదే ఉంటుంది. కొడుకు కోడలు చనిపోవడంతో మనవరాలిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాడు. అలాంటిది ఒక రోజు స్కూలుకు వెళ్లి మాయమైపోతుంది శ్యామ్ మనవరాలు. దాంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ (వీటివి గణేష్) కానిస్టేబుల్ చంద్ర (సత్యం రాజేష్)ను ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తాడు. మరోవైపు రామ్ (వశిష్ట) విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. దానికోసం డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన స్నేహితుడు దేవ్ (క్రాంతి కిరణ్) జల్సాలకు అలవాటు పడి 30 లక్షల పైగా అప్పులు చేస్తాడు. ఆయన అత్త వాకిలి పద్మ (ఉదయభాను) ఒక ఏరియా మొత్తాన్ని డాన్ లా పాలిస్తూ ఉంటుంది. మరోవైపు తప్పిపోయిన మరవరాలి కోసం వెతుకుతూ ఉంటాడు శ్యామ్. వీళ్ళందరి కథలోకి సత్య (సాంచి రాయ్) ఎలా వచ్చింది.. అసలు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేది అసలు కథ..

కథనం:

త్రిబాణదారి బార్బరిక్.. ట్రైలర్ చూసినప్పుడు అందరూ సోషియో ఫాంటసీ అనుకున్నారు. మహాభారతంలోని క్యారెక్టర్ తీసుకురావడంతో కచ్చితంగా ఇందులో కూడా ఏదో ఒక ఫాంటసీ అంశాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలు మాత్రం అలాంటివి కనిపించకపోవడం కాస్త డిసప్పాయింట్ చేసే విషయం. దర్శకుడు ఆ బార్బరికుడు క్యారెక్టర్ ఇప్పటి కథకు లింకు చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతేగాని ఇందులో ఫాంటసీ అంశాలు ఉండవు. స్టోరీ చాలా వరకు ఈజీగానే అర్థమయిపోతుంది. ముఖ్యంగా శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమా ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సైకియాట్రిస్ట్.. ఆయన మనవరాలు మిస్ అవుతుంది.. మరోవైపు ఇద్దరు కుర్రాళ్ళు ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా ఉంటారు.. వీళ్ళందరి చుట్టూ కథ సాగుతూ ఉంటుంది. ఫస్టాఫ్ చాలా వరకు వేగంగానే వెళ్ళిపోయింది. అక్కడక్కడ చిన్నచిన్న ట్విస్టులు ఇస్తూ.. స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కి జరిపాడు దర్శకుడు. సత్యరాజ్ మనవరాలు మిస్ అయిన తర్వాత స్టోరీ కాస్త వేగంగా వెళుతుంది.

ఇంటర్వెల్ టైంకు మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం అంత వేగంగా సాగలేదు అనిపించింది. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయి కేసు సాల్వ్ అయ్యే సమయంలో ఇంకాస్త పగడ్బందీ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చినా కూడా అది చాలామందికి ముందుగానే అర్థం అయిపోతుంది. రెగ్యులర్ రివెంజ్ డ్రామా కోరుకునే వాళ్లకు ఈ సినిమా పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇందులో ఫాంటసీ అంశాలు లేకపోవడం.. ట్రైలర్ అలా కట్ చేయడంతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా ఆ విషయంలో డిసప్పాయింట్ అవుతారు. అలాకాకుండా ఒక కమర్షియల్ ఫార్మాట్ రివేంజ్ డ్రామా చూడాలి అనుకునే వాళ్లకు బార్బరిక్ మంచి ఆప్షన్.

నటీనటులు:

సైకియాట్రిస్ట్ పాత్రలో సత్యరాజ్ చాలా బాగా నటించాడు. చాలావరకు ఆయన కేవలం కళ్ళతోనే నటించాడు. మరో కీలక పాత్రలో వశిష్ట బాగానే మెప్పించాడు. క్రాంతి కిరణ్ అనే కొత్త నటుడు కూడా బాగానే నటించాడు. ఇక సత్యం రాజేష్ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయాడు. సత్యరాజ్ మనవరాలు పాత్రలో మేఘన నటన బాగుంది. సాంచి రాయ్ పాత్ర కూడా పర్లేదు. ఇక చాలా రోజుల తర్వాత ఉదయభాను స్క్రీన్ మీద కనిపించింది. డాన్ పాత్రలో బాగానే నటించింది ఈమె. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతం పర్లేదు. పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. కేవలం రెండు గంటల 8 నిమిషాల నిడివి మాత్రమే ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. రమేష్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఎక్కువ భాగం వర్షంలోనే సాగుతుంది. ఇక నిర్మాత విజయపాల్ రెడ్డి ఖర్చు విషయంలో కథకు తగ్గట్టు ముందుకు వెళ్లిపోయారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స ప్రేక్షకులను మిస్ లీడ్ చేశాడేమో అనిపించింది. ట్రైలర్లో సోషియో ఫాంటసీ అని కాకుండా నేరుగా ఆయింట్ చూపించి ఉంటే బాగుండేది. రివేంజ్ డ్రామాలా చూస్తే మాత్రం ఇది పర్లేదు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా త్రిబాణదారి బార్బరిక్.. రివేంజ్ డ్రామా..!