Nagabandham Review : నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా..?
‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్ నామా తెరకెక్కించారు. ఇదివరకే ట్రైలర్, టీజర్ ద్వారా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా ఇప్పటికే ట్రైలర్ 11 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: నాగబంధం
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, జగపతిబాబు, రిషబ్ సహానీ, ఐశ్వర్య మీనన్, దక్ష నగర్కర్, మహేష్ మంజ్రేకర్, గరుడ రామ్ తదితరులు
ఎడిటింగ్: RC ప్రణవ్
సంగీతం: జునైద్ కుమార్, అబే
సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి
దర్శకుడు: అభిషేక్ నామా
‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ఈ కథ అంతా 1756 నుంచి 1962 మధ్యలోనే జరుగుతుంది. అనంతపద్మనాభ స్వామి నాభిలోని బ్రహ్మకమలం చుట్టూ కథ అల్లుకున్నారు. మరణం లేని జీవితం, సృష్టిని శాసించే బలం కోసం కొందరు మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసమే అత్యంత శక్తివంతమైన ‘బ్రహ్మకమలం’ దక్కించుకోవడం కోసం యుద్ధం చేస్తూ ఉంటారు. 1962లో ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు) ‘నాగబంధం’ అనే ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉంటాడు. రంగనాథస్వామి గుడిలో సాక్షాత్తూ ఆ శ్రీహరి వద్ద ఉన్న ఆ బ్రహ్మకమలాన్ని కొందరు దొంగిలిస్తారు. మరోవైపు తన చెల్లెలు అంటే ప్రాణమిచ్చే రుద్ర (విరాట్ కర్ణ), ఆమె పెళ్లిలో ఊహించని విషాదాన్ని ఎదుర్కొంటాడు. ఇదే సమయంలో బ్రహ్మ కమలం దక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలని అలీ (రిషబ్ సహానీ) ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో శాపంతో వందల ఏళ్లుగా చెట్లలోనే ఇరుక్కుపోయిన భైరాగి (గరుడ రామ్) కన్ను కూడా ఆ బ్రహ్మకమలం మీదే ఉంటుంది. ఆ బ్రహ్మ కమలం కోసమే రుద్ర కుటుంబాన్ని దారుణంగా చంపేస్తాడు అలీ. తను ప్రాణంగా ప్రేమించిన పార్వతి (నభా నటేష్) కూడా రుద్రను వెన్నుపోటు పొడుస్తుంది. ఇంతటి విషాదం నుంచి రుద్ర ఎలా బయటపడ్డాడు? అనంతమైన శక్తుల కోసం విలన్ చేసిన కుట్రలను ఎలా అడ్డుకున్నాడు? అసలు అనంత పద్మనాభ స్వామి గుడికి, ఈ బ్రహ్మకమలానికి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ స్క్రీన్ మీదే చూడాలి..
కథనం:
ఈ మధ్య కాలంలో దేవుడి నేపథ్యం, సనాతన ధర్మం అనే అంశాలను వాడుకుంటూ వచ్చిన పలు చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అదే ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చిన సినిమా నాగబంధం. ఇందులో కూడా మొదటి నుంచి హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాలు, వాటి సంరక్షణ చుట్టూనే కథ అల్లుకున్నారు. కథలో సహజంగా దైవభక్తి ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. నాగబంధంలో కొన్ని సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయితే.. మరికొన్ని మాత్రం అతికించినట్లు అనిపిస్తాయి. ఈ సినిమా కోసం తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.. దాన్ని విజువల్స్‌తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు అభిషేక్ నామా. మొదటి నుంచి విజువల్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసారు. ప్రతీ సీన్‌లోనూ ఆ గ్రాండియర్ చూపించే ప్రయత్నమైతే వాళ్లలో స్పష్టంగా కనిపించింది. సినిమా మొదలుపెట్టిన తీరుకు.. ముగించిన తీరుకు మాత్రం కాస్త తడబాటు కనిపించింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం అదేదో ఫాంటసీ సినిమా చూసినట్టు విజువల్స్ మీద వెళ్లిపోయారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎవరు మంచి.. ఎవరు చెడు.. బ్రహ్మకమలం కోసం ఎవరెన్ని నాటకాలు ఆడుతున్నారు అనేది అంత ఈజీగా అర్థం కాదు. ప్రతీ సీన్‌లో విలన్లు మారిపోతూ ఉంటారు. సెకండాఫ్ పూర్తిగా కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది. సనాతన ధర్మం వైపు మళ్లుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ అంటూ ఆలయాల మీద అనాటి ఖిల్జీలు చేసిన మారణకాండను బాగానే చూపించారు. హీరో కుటుంబ సభ్యులను విలన్ దారుణంగా చంపే సన్నివేశం కాస్త వయొలెన్స్ ఎక్కువైంది. అద్భుతమైన విజువల్స్, పాటలలో కనిపించే గ్రాండియర్ ఈ సినిమాకు ప్రాణం. దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా నాగసాధువుల సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా విజువల్స్‌తో బంధం ముడివేసింది నాగబంధం.
నటీనటులు:
రుద్ర పాత్రలో విరాట్ కర్ణ తన వంతుగా చాలా బాగా కష్టపడ్డాడు. ఒక సాధారణ యువకుడిగా, సాధువుగా తన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. నటుడిగా అతనికిది మంచి సినిమా అవుతుంది. పార్వతి పాత్రలో నభా నటేష్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకుంది. ఆమె పాత్రలోని మలుపు ఆడియన్స్ కు థ్రిల్ ఇస్తుంది. ఆర్కియాలజిస్ట్‌గా జగపతిబాబు ఎప్పట్లాగే తన పరిణతి చెందిన నటనతో మెప్పించాడు. భైరాగి పాత్రలో గరుడ రామ్, ప్రతినాయకుడిగా రిషబ్ సహానీ తమ భయంకరమైన నటనతో భయపెట్టారు. అనసూయ, ఐశ్వర్య మీనన్, మురళీ శర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించి మెప్పించారు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
నాగబంధం సినిమాకు ప్రధాన బలం సంగీతం.. జునైద్ కుమార్, అభిషిక్త్ తదితరులు అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. సౌందర్ రాజన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది, ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్‌గా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల మినహా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకుడు అభిషేక్ నామా కూడా తన వంతు బాధ్యత బాగానే పూర్తి చేసారు. కథపై ఇంకాస్త లోతుగా వెళ్లుంటే బాగుండేది. చివర్లో పార్ట్ 2కు లీడ్ ఇచ్చారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా నాగబంధం.. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసే పోరాటం..!
