Mirai Movie Review: మిరాయ్ రివ్యూ.. తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా..

హనుమాన్ సినిమాతో సూపర్‌ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ఇప్పుడు మిరాయ్ లో 'సూపర్ యోధా' పాత్రలో మెరిసాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను భారీ స్కేల్‌లో రూపొందించాడు. భారతీయ పురాణాలు, ఫాంటసీ, హై-ఇంటెన్సిటీ యాక్షన్‌తో వచ్చింది ఈ సినిమా. మరి ఇది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Mirai Movie Review: మిరాయ్ రివ్యూ.. తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా..
Mirai

Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2025 | 12:01 PM

మూవీ రివ్యూ: మిరాయ్

నటీనటులు: తేజ సజ్జ, రితిక నాయక్, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరాం, గెటప్ శీను తదితరులు

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

సంగీతం: గౌరీ హరి

నిర్మాత: టీజీ విశ్వప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

కథ:

వేద ప్రజాపతి (తేజ సజ్జ) ఒక అనాధ. చిన్నప్పుడే ఒక లోక కార్యం కోసం వాళ్ళ అమ్మ, భవిష్యత్తును సైతం చూడగలిగే శక్తి ఉన్న అంబిక (శ్రియా) వేదను వదిలేస్తుంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదు అని.. తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో అమర్చి 9 మంది యోధులకు ఇస్తాడు. దాన్ని మహావీర్ లామా (మంచు మనోజ్) చేజెక్కించుకొని దేవుడు అవ్వాలి అనుకుంటాడు. అలా జరగకుండా.. అతడిని ఆపే ఆయుధం మిరాయ్. దానికోసం వేదా ఏం చేశాడు.. ఆయనకు విభా (రితిక నాయక్), హిమాలయాలలో ఉండే అగస్త్య (జయరాం) ఎలా సాయపడ్డారు.. వేద తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేసాడు అనేది మిగిలిన కథ.

కథనం:

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో అడక్కూడదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే.. మిరాయ్ కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు.. వీటి కంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలింది. ఈసారి రాముడి కోదండానికి పూనకాలు ఖాయం. కథ ఆల్రెడీ చెప్పేశారు.. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదు అని.. తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో అమర్చి 9 మంది యోధులకు ఇస్తాడు. దాన్ని విలన్ చేజెక్కించుకొని దేవుడు అవ్వాలి అనుకుంటాడు. అలా జరగకుండా.. అతడిని ఆపే ఆయుధం మిరాయ్. కథకు మొదటి సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు దర్శకుడు కార్తీక్..

ఆయనకు ఆ రాముడి స్టిక్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఫస్టాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా, నెమ్మదిగా వెళుతుంది.. ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడ నుంచి సినిమా ఆగలేదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్.. సెకండ్ ఆఫ్ లో కూడా రెండు మూడు సీన్స్ గూస్ బంప్స్ గ్యారెంటీ. హనుమాన్ లో రుధిరమణి.. మిరాయ్ లో ఆ రామచంద్రుడి కోదండం.. తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జ. చాలా మంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేస్తారు కానీ.. అన్నీ కుదిరితేనే వర్కౌట్ అవుతాయి. అప్పుడు హనుమాన్.. ఇప్పుడు మిరాయ్.. ఈ రెండు తేజకు కుదిరాయి.. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు కోట్లాది మంది కొలిచే దైవం.. నడిపించే ధైర్యం.. మిరాయ్ లో దాన్ని బాగా చూపించారు. ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నెరేషన్ తప్పదు.. అది పెద్ద సమస్య కాదు. ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్ పక్కా పైసా వసూల్. ఓవరాల్ గా మిరాయ్.. చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్.

నటీనటులు:

తేజ సజ్జ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచాడు యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అదరగొట్టాడు. మంచు మనోజ్ ‘బ్లాక్ స్వోర్డ్’ విలన్‌గా తన ఫైట్ సన్నివేశాల్లో డామినేట్ చేశాడు. ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. రితికా నాయక్ సపోర్టింగ్ హీరోయిన్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జగపతి బాబు, జయరామ్ లాంటి సపోర్టింగ్ కాస్ట్ తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు. శ్రీయకు లైఫ్ టైం క్యారెక్టర్ పడింది.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు మరో హీరో ఉన్నాడు.. అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి. సినిమాకు ఆయువు రీ రికార్డింగ్. చాలా సన్నివేశాలు కేవలం RR తో హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగానే కాదు సినిమాటోగ్రాఫర్ గానూ సత్తా చూపించాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా మిరాయ్.. టెక్నికల్ బ్రిలియన్స్ విత్ డివోషనల్ టచ్.. జై శ్రీరామ్..!