Raja Vikramarka Movie Review: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ అంటే అన్నాడు కానీ, ఆయనతో పాటు మరికొందరు హీరోలకు ఆ మాట సూటవుతుంది. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కార్తికేయకు సూట్ అయినట్టు. ఆర్‌ఎక్స్ 100 తరహా సక్సెస్ కోసం ఎన్నాళ్లుగానో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కార్తికేయ. శుక్రవారం రిలీజైన రాజా విక్రమార్క ఆ రేంజ్ మూవీ అవుతుందా? త్వరలో పెళ్లిపీటలెక్కనున్న కార్తికేయకు ఈ సినిమా ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండబోతోంది?
సినిమా: రాజా విక్రమార్క
నిర్మాత: 88 రామిరెడ్డి
సమర్పణ: టి. ఆదిరెడ్డి
సంస్థ: శ్రీ చిత్ర మూవీ మేకర్స్
దర్శకత్వం: శ్రీ సరిపల్లి
నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సుధాకర్ కొమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, పసుపతి, హర్షవర్ధన్ తదితరులు
ఎన్‌ఐఎ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు రాజా విక్రమార్క (కార్తికేయ). సిన్సియర్‌గా ఉండటం మాత్రమే కాదు, సరదాగానూ ఉంటాడు. సీనియర్ ఎన్‌ఐఏ ఆఫీసర్ (తనికెళ్ల భరణి) ని బాబాయ్ అంటుంటాడు. ఆయన సూచన ప్రకారం ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ (సాయికుమార్) సెక్యూరిటీ కోసం వెళ్తాడు. వెళ్లిన చోట ఓ ఎల్‌ఐసీ ఏజెంట్ (హర్షవర్ధన్) దగ్గర పనిలో కుదురుతాడు. హోమ్ మినిస్టర్ కూతురు కాంతి(తాన్య)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. హోమ్ మినిస్టర్‌ని గురు నారాయణ్(పసుపతి) టార్గెట్ నుంచి రాజా విక్రమార్క తప్పించగలిగాడా? గురు నారాయణ్ బ్రదర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఫ్యామిలీతో ఉన్న పరిచయం ఏంటి? రూ.10కోట్ల ఇన్స్యూరెన్స్ పాలసీ కహానీ ఏంటి? వంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఫక్తు కమర్షియల్ సినిమాలా సాగింది రాజా విక్రమార్క. హీరో ఎలివేషన్‌తో పాటు, రిలీఫ్ కోసం కొన్ని సరదా సన్నివేశాలను చిత్రీకరించారు. తాన్య శాస్త్రీయ నృత్యం బావుంది. పసుపతికి, సుధాకర్‌కి ఉన్న రిలేషన్‌ని సస్పెన్స్ లో ఉంచడం బావుంది. కాకపోతే గురు నారాయణ్‌కి ఇచ్చిన ఎలివేషన్‌ని సస్టయిన్ చేయడంలో ఎక్కడో మిస్‌ఫైర్ అయినట్టు అనిపించింది. కాంతి కిడ్నాప్ కావడం, ఆమె కోసం గురు నారాయణ్‌ని రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఓల్డ్ సిటీకి విక్రమ్ వెళ్లే సీన్లు.. పెద్దగా కన్విన్సింగ్ అనిపించవు.
అయితే కార్తికేయ కెరీర్‌లో ఇప్పటిదాకా కనిపించనంత స్టైలిష్‌గా, మ్యాన్లీగా, ఈజ్‌తో నటించారు. తాన్య పెర్ఫార్మెన్స్ కూడా ఉన్నంతలో బావుంది. గురు నారాయణ కేరక్టర్‌లో పసుపతి యాప్ట్. సెక్యూరిటీ ఆఫీసర్‌గా సుధాకర్ కొమాకుల రోల్ బావుంది. తనికెళ్ల భరణికి మంచి రోల్ ఇచ్చారు. సినిమా పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపించింది. సినిమాలో డైలాగులు నేచురల్‌గా అనిపించాయి. సెకండ్ హాఫ్ ఇంకాస్త గ్రిప్సింగ్ గా రాసుకుని ఉండాల్సింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకాస్త వర్క్ జరగాల్సింది. సరదాగా కమర్షియల్ సినిమా చూడాలనుకునేవారికి నచ్చుతుంది.
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read..
Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’