Deewana Review: దీవానా మూవీ రివ్యూ.. హైదరాబాదీ కుర్రాడి కథ ఎలా ఉందో తెలుసా..?
ప్రేమకథల్లో కొత్తదనం, మంచి ఫీల్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే దర్శకులు తరచూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ జానర్‌లో సినిమా తీస్తే చాలా వరకు సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. సరిగ్గా ఇలాంటి ఓ స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దీవాన. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేర ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

మూవీ రివ్యూ: దీవానా
నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహా మనిమేఘలై, నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు
ఎడిటింగ్: హృషికేశ్ పస్పల్
సినిమాటోగ్రఫీ: పచ్చిపులుసు వంశీ
సంగీతం: ఈశ్వర్ చంద్
నిర్మాతలు: అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
దర్శకుడు: శ్రీకాంత్ సంఘిశెట్టి
కథ:
మున్నా (హర్షిత్ రెడ్డి) ఎలాంటి లక్ష్యం లేకుండా గాలికి తిరిగే కుర్రాడు. డిగ్రీ పూర్తయినా ఉద్యోగం చేయకుండా స్నేహితులతో జల్సాలు చేస్తుంటాడు. తండ్రి శేఖర్ (నరేష్) కష్టపడి పని చేస్తూ కొడుకును ప్రాణంగా చూసుకుంటాడు. కానీ మున్నా మాత్రం అవేమీ పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి సమయంలో మీ సేవా సెంటర్‌లో పని చేసే అమూల్య (స్మేహా మణిమేఘలై)ను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కోసం రోజూ అక్కడికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అయితే తాను నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నానని.. కనీసం 20000 కూడా సంపాదించలేని నువ్వు ముందు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాకే నా ముందుకు రావాలని అమూల్య గట్టిగా చెప్పేస్తుంది. అమూల్య అలా ఎందుకు అంది? ఆమె కోసం మున్నా కష్టపడి గవర్నమెంట్ జాబ్ సాధించాడా? చివరకు వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది మిగతా కథ.
కథనం:
ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తిని కలిగించదు. సాధారణ యూత్ సినిమాల్లాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్‌గా సాగుతుంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ ఫైట్ అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే అనుకోని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడి నుంచి సినిమాపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. పోలీస్ స్టేషన్‌లో నరేష్ నటన, తండ్రి విలువ గురించి రఘు చెప్పే మాటలు, హీరోయిన్ తన మనసులోని ప్రేమను స్నేహితురాలితో పంచుకునే సీన్ గుండెను హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ మలుపు, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అయితే హీరో పోలీస్ ట్రైనింగ్, ఒకే అటెంప్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లాంటివి సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టుకోవాలి. వాటిలో లాజిక్స్ వెతకకూడదు. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే ఉంది.
నటీనటులు:
బాధ్యత లేని యువకుడిగా, ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో హర్షిత్ రెడ్డి తన నటనతో ఆకట్టుకుంటాడు. రెండు షేడ్స్ అదిరిపోయాయి. అమూల్య పాత్రలో స్మేహా మణిమేఘలై అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పించింది. హీరో, హీరోయిన్ల స్నేహితులుగా చేసిన వారికి మంచి గుర్తింపు దక్కుతుంది. నరేష్ తన అనుభవంతో మరోసారి ప్రేక్షకులను ఏడిపిస్తాడు. వేణు, రఘు తమ పాత్రల మేరకు గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తల్లి పాత్రలో ఝాన్సీ సహజంగా నటించింది. మిగతా వాళ్ళంతా తమ పరిధిలో బాగానే చేశారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు.
టెక్నికల్ టీం:
సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. విజువల్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ఈశ్వర్ చంద్ పాటలు బాగున్నాయి.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ ఇచ్చేలా సినిమాను తీయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. టెక్నికల్ టీం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. దర్శకుడు శ్రీకాంత్ కూడా హానెస్ట్ అటెంప్ట్ చేశాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా దీవానా.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్.. గట్టిగా ఎక్కేస్తుంది..!
