
మూవీ రివ్యూ: దండోరా
నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం: మురళీకాంత్
కులం అనే కాన్సెప్ట్ అంత చిన్నదేం కాదు.. దానిపై సినిమా చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అటూ ఇటూ అయినా మొదటికే మోసం వస్తుంది. అలాంటి సున్నితమైన కథతోనే దండోరా సినిమా వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
మెదక్‌లోని ఓ ఊరిలో శివాజీ (శివాజీ) అగ్ర కులానికి చెందినవాడు. ప్రాణం కంటే కులానికే ఎక్కువ విలువ ఇస్తుంటాడు. శివాజీకి కొడుకు విష్ణు (నందు), కూతురు సుజాత (మణిక) ఉంటారు. కొడుకు సిటీలో జాబ్ చేస్తుంటాడు. అదే సమయంలో ఊళ్లో ఉండే కూతురు వేరు కులం అబ్బాయి రవి (రవికృష్ణ)తో ప్రేమలో పడుతుంది. అది తెలిసిన శివాజీ కులం వాళ్లకు ఒళ్లు మండిపోతుంది. అప్పుడు వాళ్లేం చేసారు..? సర్పంచ్ (నవదీప్) ఊళ్లో జరిగిన సంఘటనలకు ఎలా సాక్షిగా మిగిలిపోయాడు..? పదవిలో ఉండి కూడా ఎందుకు ఏం చేయలేదు..? మధ్యలో శ్రీలత (బిందు మాధవి) ఎక్కడ్నుంచి వచ్చింది..? ఆమెకు శివాజీకి ఏంటి సంబంధం అనేది పూర్తి కథలో చూడాల్సిందే.
కథనం:
కులం.. కాదనుకోలేం.. కావాలనుకోలేం.. అలా సాగిపోవాలంతే..! అలాంటి క్యాస్ట్ జోన్ లో వచ్చిన మరో సినిమా దండోరా. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు కులం కాన్సెప్టుతో వచ్చాయి. కానీ ఇక్కడే దర్శకుడు ఇందులో కొత్త టర్న్ తీసుకున్నాడు. కులం అంటే.. ఎప్పుడూ అగ్ర కులం వల్ల తక్కువ కులం నష్టపోవడం చూపిస్తారు.. దండోరాలో మాత్రం బాధితుడే అగ్ర కులం వాడు కావడం కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ వరసగా క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తుంటాయి. అన్నీ పరిచయం చేస్తూ.. అక్కడక్కడా తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు దర్శకుడు మురళీకాంత్. ఇంటర్వెల్ కు సినిమా పీక్ ఎమోషన్‌కు వెళ్ళింది. అక్కడ ఆయన తీసిన విధానం కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అలాంటి సీన్స్ రాయడం ఈజీనే కానీ తీయడం కష్టమే. సెన్సార్ నుంచి తప్పించుకుని కొన్ని సీన్స్ కూడా బాగానే పెట్టాడు. ఇంటర్వెల్ చాలా హార్డ్ హిట్టింగ్ అండ్ రియలిస్టిక్‌గా ఉంది. సెకండ్ హాఫ్ బాగా వేగంగా, ఎమోషనల్‌గా వెళ్ళింది. శివాజీతో ఓ కోర్టు సీన్ ఉంటుంది.. అక్కడి నుంచి సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్ళింది.. ఆ సీన్ లో రైటింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా వెరీ ఎమోషనల్ అండ్ హార్డ్ హిట్టింగ్. ఆలోచించేలా దండోరా ఉంది.
నటీనటులు:
శివాజీ మరోసారి అదరగొట్టాడు.. మంగపతికి సీక్వెల్ చూసినట్టుంది. సెకండ్ హాఫ్ లో శివాజీ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. నవదీప్ 2.0 అని స్క్రీన్ మీద పడింది.. నిజంగానే 2.0 చూపించాడు సర్పంచ్ రోల్‌లో..! చివర్లో కూడా మంచి ఎమోషనల్ ఎండింగ్ ఉంది. నందుకు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. రవికృష్ణ, మణిక, మౌనిక రెడ్డి, బిందు మాధవి అంతా బాగా నటించారు. మిగిలిన వాళ్ళంతా ఓకే.
టెక్నికల్ టీం:
మార్క్ కే రాబిన్ మ్యూజిక్ బాగుంది. పాటల కంటే కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సృజన ఎడిటింగ్ కూడా పర్లేదు. ఫస్టాఫ్ కాస్త ల్యాగ్ అనిపించినా పెద్దగా అడ్డుగా అయితే ఏం అనిపించదు. నిర్మాత బెన్నీ పనితీరు బాగుంది. ఇలాంటి సినిమాలకు బడ్జెట్ పెట్టడానికి ధైర్యం కావాలి. దర్శకుడు మురళీకాంత్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒరిజినల్ అప్రోచ్‌తో సినిమా చేశాడు. తనవరకు చాలా హానెస్ట్‌గా తీసాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా దండోరా.. హానెస్ట్ అటెంప్ట్.. ఒక మంచి సినిమా..!