Bhartha Mahasayulaku Wignyapthi movie review: భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ.. మాస్ మహారాజ్ హిట్ కొట్టాడా..!
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ రాజా రవితేజ.. తన పంథా మార్చుకుని చేసిన ప్రయత్నమే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘మాస్ జాతర’ లాంటి మాస్ మసాలా సినిమా తర్వాత అతి తక్కువ గ్యాప్‌లో వచ్చిన ఈ సినిమా.. రవితేజను తిరిగి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

మూవీ రివ్యూ: భర్త మహాశయులకు విజ్ఞప్తి
నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్, సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్
సంగీతం: భీమ్స్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కిషోర్ తిరుమల
కథ:
రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్‌యార్డ్ ఓనర్. భార్య బాలామణి (డింపుల్ హయతి) అంటే భయం, భక్తి ఉన్న సాధారణ భర్త. వ్యాపార లావాదేవీల కోసం స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ పరిచయమైన మానస శెట్టి (అషికా రంగనాథ్)తో అనుకోని పరిస్థితుల్లో ఫిజికల్‌గా కనెక్ట్ అవుతాడు. ఇండియాకు తిరిగొచ్చాక.. ఆ విషయాన్ని భార్యకు తెలియకుండా చూసుకుంటాడు. కానీ అదే సమయంలో స్పెయిన్ నుంచి పని మీద ఇండియాకు వస్తుంది మానస. దాంతో ఇద్దరి మధ్య ఇరుక్కుంటాడు రామ్. భార్య గురించి ప్రియురాలికి.. ఆమె గురించి ఈమెకు తెలియకుండా చూసుకోడానికి రామ్ పడే పాట్లు, ఈ క్రమంలో జరిగే పరిణామాలే మిగతా కథ.
కథనం:
ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న ఒక మగవాడి కథ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. రొటీన్ పాయింట్‌ని డైరెక్టర్ కిషోర్ తిరుమల ఎంచుకోవడం సాహసమే అయినా.. దాన్ని కామెడీతో నడిపించిన విధానం మెప్పిస్తుంది. సినిమా మొదలవ్వడం కాస్త నెమ్మదిగానే ఉంటుంది. 40 నిమిషాల తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, స్పెయిన్ ఎపిసోడ్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో బలం లేకపోవడం, స్క్రీన్‌ప్లేలో వేగం లోపించడంతో ఇంటర్వెల్ వరకు సినిమా సో-సో గానే సాగుతుంది. పైగా సినిమాను హడావిడిగా చుట్టేసినట్లుగా అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయి. కానీ ఫస్టాఫ్‌లో వచ్చిన లోపాలు ద్వితీయార్థంలో కనబడవు. అక్కడ్నుంచి సినిమా స్వరూపమే మారిపోతుంది. ఎప్పుడైతే కథ ఇండియాకి షిఫ్ట్ అవుతుందో.. అక్కడి నుంచి వినోదం పరుగులెడుతుంది. భార్యకు నిజం తెలియకుండా హీరో, అతనికి సాయం చేసే ఫ్రెండ్స్ ఆడే నాటకలు కడుపుబ్బ నవ్విస్తాయి. దర్శకుడు లాజిక్స్ పక్కనపెట్టి, కేవలం మ్యాజిక్ మీదే ఫోకస్ పెట్టడం సినిమాకు కలిసొచ్చింది. క్లైమాక్స్‌లో ఎలాంటి భారీ ట్విస్టులు ఇవ్వకుండా, సింపుల్‌గా ముగించడం బాగుంది. ఈ క్రమంలోనే వచ్చే కొన్ని సన్నివేశాలు బాగానే నవ్వి తెప్పించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ అన్నింటినీ వాడేసాడు కిషోర్. జనరేటర్‌లో చక్కెర పోసే సీన్ మాత్రమే కాదు.. ఇలాంటి ట్రెండింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. సెకండాఫ్‌లో వచ్చే పబ్ కార్తిక దీపం సీరియల్ సాంగ్ ఎపిసోడ్, ఆ తర్వాత సంక్రాంతి ఎపిసోడ్ బాగున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొత్తదనం కోరుకునే వారికి నిరాశ కలిగించొచ్చు కానీ.. లాజిక్కులు పక్కనపెట్టి కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి, రవితేజ అభిమానులకు ఈ సినిమా పర్లేదు. వరుస ఫ్లాపుల తర్వాత రవితేజకు ఇది కచ్చితంగా ఊరటనిచ్చే సినిమానే.
నటీనటులు:
రవితేజ చాలా కాలం తర్వాత తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. మాస్ డైలాగులు, అనవసరమైన యాక్షన్ సీన్స్ లేకుండా, ఒక సగటు భర్తగా, భయస్తుడిగా ఆయన నటన చాలా బాగుంది. అషికా రంగనాథ్ గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మోడరన్ లుక్‌లో ఆమె యూత్‌ని ఆకట్టుకుంటుంది. డింపుల్ హయతి వైఫ్ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకు సత్య కామెడీ బాగానే పనికొచ్చింది. వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ తమ పరిధి మేరకు నవ్వించారు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. డీజే మిక్స్ సాంగ్ థియేటర్లో ఊపు తెస్తుంది. స్పెయిన్ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. ఫస్టాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది. కిషోర్ తిరుమల రొటీన్ కథనే తీసుకున్నా, దానికి ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి సేఫ్ గేమ్ ఆడాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా భర్త మహాశయులకు విజ్ఞప్తి.. కాసేపు నవ్వుకోవచ్చు..!
