God Father Review: లూసిఫర్‌ని మరిపించే స్క్రీన్‌ప్లేతో ‘గాడ్‌ఫాదర్‌’..

| Edited By: Ravi Kiran

Oct 05, 2022 | 3:24 PM

లూసిఫర్‌ మలయాళంలో చాలా పెద్ద హిట్‌ మూవీ. మోహన్‌లాల్‌కి ఉన్న చరిష్మాను మరో రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది. పృథ్విరాజ్‌కెరీర్లో డైరక్టర్‌గా గోల్డెన్‌ ఫిల్మ్.

God Father Review: లూసిఫర్‌ని మరిపించే స్క్రీన్‌ప్లేతో గాడ్‌ఫాదర్‌..
God Father
Follow us on

లూసిఫర్‌ మలయాళంలో చాలా పెద్ద హిట్‌ మూవీ. మోహన్‌లాల్‌కి ఉన్న చరిష్మాను మరో రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది. పృథ్విరాజ్‌కెరీర్లో డైరక్టర్‌గా గోల్డెన్‌ ఫిల్మ్. తెలుగులోనూ అనువాదమై కొంతకాలం ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అన్నా చెల్లెలు, ఓ రాష్ట్రం సీఎం, ఫ్యామిలీ ఇబ్బందులు, పొలిటికల్‌ ఇష్యూస్‌… స్థూలంగా కథాంశం ఇదే. అయినా జనాలను మెప్పించిన కథగా రికార్డు సృష్టించింది. మరి అదే కథ తెలుగులో గాడ్‌ఫాదర్‌గా ఏమేరకు ఆకట్టుకుంది? చూసేద్దాం…

  • సినిమా: గాడ్‌ఫాదర్‌
  • నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ఫిల్మ్స్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా
  • మాటలు: లక్ష్మీభూపాల్‌
  • నిర్మాతలు రామ్‌చరణ్‌, ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌
  • నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌, నయనతార, పూరి జగన్నాథ్‌, సత్యదేవ్‌, సునీల్‌, దివి, బ్రహ్మాజీ, గంగవ్వ, సముద్రఖని, మురళీశర్మ తదితరులు
  • కెమెరా: నీరవ్‌షా
  • విడుదల: 05.10.2022

జనజాగృతి పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం పీకేఆర్‌ కన్నుమూస్తాడు. రాజకీయ సంక్షోభం మొదలవుతుంది. సీఎం కొడుకు బ్రహ్మ(చిరంజీవి). కూతురు సత్యప్రియ(నయనతార).వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. సత్యప్రియ భర్త జయదేవ్‌(సత్యదేవ్‌) సీఎం కావాలని కలలు కంటాడు. ఆ పదవి కోసం వర్మ(మురళీశర్మ) కూడా ఆశపడుతుంటాడు. అయితే జయదేవ్‌కి భయపడి తన కోరికను చంపుకుంటాడు. సత్యప్రియకు మాయమాటలు చెప్పి ఆమె ద్వారానే జయదేవ్‌ పావులు కదుపుతుంటాడు. సత్యప్రియ చెల్లెలికి డ్రగ్స్ అలవాటు చేస్తాడు. డ్రగ్స్ డీలర్స్‌తోనూ కాంటాక్ట్స్ పెంచుకుంటాడు. ఇవన్నీ ఓ కంట గమనిస్తుంటాడు బ్రహ్మ. చేయని నేరానికి శిక్ష వేసి బ్రహ్మను జైలుకు పంపిస్తాడు జయదేవ్‌. నేరం మోపిన వాళ్లే నిజం ఒప్పుకోవడంతో జైలు నుంచి బయటకు వస్తాడు బ్రహ్మ. వచ్చిన అతనికి ఓసారి సత్యప్రియ ఫోన్‌ చేస్తుంది. అతన్ని కలుస్తుంది. తన మనసులో బాధను చెప్పుకుంటుంది. చెల్లెలు చెప్పిన విషయం ఆసాంతం విన్న బ్రహ్మ రంగంలోకి దిగతాడు. అతని ఫ్రెండ్‌ మసూమ్‌ ఖాన్‌ సాయం చేయడానికి వస్తాడు. ఇంతకీ మసూమ్‌ ఖాన్‌ ఎవరు? అతనికి గతంలో పరిచయం ఉన్న ఖురేషికి, బ్రహ్మకి సంబంధం ఏంటి? 20 ఏళ్ల పాటు బ్రహ్మ ఎక్కడికి వెళ్లాడు? అతని కంపెనీ ఏంటి? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

లూసిఫర్‌లో మోహన్‌లాల్‌ రోల్‌కి ఇక్కడ చిరంజీవి సరిపోతారా? లేదా? అక్కడ గూస్‌బంప్స్ తెప్పించిన షాట్స్ ఇక్కడ హైలైట్‌ అవుతాయా? కావా? అని చాలా మంది మొదట్లో అనుమానించారు. అయితే అలాంటి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. గాడ్‌ఫాదర్‌ టైటిల్‌ రోల్‌కి న్యాయం చేసేలా పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ప్లాన్‌ చేశారు మోహన్‌రాజా. సత్యప్రియ రోల్‌కి నయనతార పర్ఫెక్ట్ గా సూటయ్యారు. మలయాళంలో వివేక్‌ ఒబేరాయ్‌తో పోలిస్తే సత్యదేవ్‌ ఇక్కడ ట్రెమండెస్‌గా నటించారు. స్క్రిప్టులో చేసిన మార్పులు చాలా బావున్నాయి. ఒరిజినల్‌లో కనిపించే తమ్ముడు కేరక్టర్‌ ఇక్కడ లేదు. లూసిఫర్‌ నిజంగానే సీఎం కొడుకా? కాదా? అనే సందిగ్ధం ఒరిజినల్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ క్లియర్‌గా కొడుకనే విషయాన్ని కన్వే చేసేశారు. నయనతార కూతురు కేరక్టర్‌ని ఇక్కడ చెల్లెలిగా మార్చడం కూడా కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది.

సినిమాకు నీరవ్‌షా కెమెరా హైలైట్‌. మోహన్‌రాజా పల్స్ పట్టుకుని ప్రతి షాట్‌నీ ఎలివేట్‌ చేశారు తమన్‌. తమన్‌ మ్యూజిక్‌కి స్పెషల్‌ అప్లాజ్‌ వస్తుంది. అలాగే తప్పక మెన్షన్‌ చేయాల్సిన మరో పేరు లక్ష్మీభూపాల్‌. ప్రతి మాటనూ శ్రద్ధగా రాశారు. ఆయా కేరక్టర్ల బిహేవియర్‌ని, బాడీ లాంగ్వేజ్‌నీ బట్టి ఆయన రాసిన మాటలు మెప్పిస్తాయి. పూరి జగన్నాథ్‌ కేరక్టర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. సునీల్‌, షఫి, దివి, గంగవ్వ, బ్రహ్మాజీ, సముద్రఖని,భరత్‌రెడ్డి, అనసూయ.. ఇలా ప్రతి పాత్రకూ స్క్రీన్‌ మీద న్యాయం చేశారు డైరక్టర్‌.

గాడ్ ఫాదర్ బెస్ట్ డైలాగులు కొన్ని.. 

  • ప్రొటోకాల్‌ కారుకే గానీ నా కళ్లకు కాదుగా,
  • మన దేశంలో ధైర్యంగా వెలుగులో చేసే ఒకే ఒక తప్పు పాలిటిక్స్, మిగిలినవన్నీ చీకట్లో చేసేవే,
  • పీకేఆర్‌ పోతోనే నువ్వు సీఎం అయితే, పీకేఆర్‌ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి,
  • మన అవసరాన్ని ఎదుటివారి అవసరం మారిస్తే ఆ తర్వాత మనం కష్టపడక్కర్లేదు, వాళ్లే కష్టపడతారు…,
  • నాకు కావాల్సింది పదవి కాదు, పద్ధతి..,
  • నీకు ఎవరూ లేరనుకునేదానివి… దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు,
  • మ్యాచ్‌ అయ్యాక క్లీన్‌ చేసిన మైదానంలా ఉంది,
  • నిర్ణయం తీసుకోవాలంటే హోదా, అధికారం కావాలంటే బాధ్యత ఉండాలి,
  • నేను రాజకీయం నుంచి దూరంగా ఉంటున్నా. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు,
  • నా శత్రువు గుర్తించని విజయం నాకు ఓటమి కంటే తక్కువ… ఇలాంటి డైలాగులు సినిమాకు ప్లస్‌ అయ్యాయి.

ప్రతి సన్నివేశంలోనూ చిరంజీవి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. సల్మాన్‌ఖాన్‌ స్క్రీన్‌ మీద చాలా యంగ్‌గా కనిపించారు. వారిద్దరూ కలిసి చేసిన సాంగ్‌, ఫైట్స్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

చివరి మాట: లూసిఫర్‌ చూసిన వాళ్లు కూడా గాడ్‌ఫాదర్‌ని ఇష్టపడతారు.

రేటింగ్ –  3.25/5
– డా. చల్లా భాగ్యలక్ష్మి