Mangli Bonalu Song: బోనాల సాంగ్ వివాదంపై తొలిసారి స్పందించిన సింగర్ మంగ్లీ.. ఆమె మాటల్లోనే..

మైసమ్మ సాంగ్‌లోని పూర్తి లిరిక్స్‌ను మార్చేసిన మంగ్లీ.. కొత్త సాంగ్‌ను విడుదల చేశారు. మార్చిన సాంగ్‌ను యూట్యూబ్‌లో అఫ్‌లోడ్ చేసిస మంగ్లీ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ రాసారు..

Mangli Bonalu Song: బోనాల సాంగ్ వివాదంపై తొలిసారి స్పందించిన సింగర్ మంగ్లీ.. ఆమె మాటల్లోనే..
Singer Mangli Reaction After Bjp Leaders Complaint To Police
Balaraju Goud

|

Jul 21, 2021 | 12:02 PM

Singer Mangli Reaction on Bonalu Song 2021: తెలంగాణలో బోనాల సీజన్‌ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను ఆడి పాడిన సింగర్‌ మంగ్లీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని కోరారు. అంతేకాదు సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు.

దీంతో దిగివచ్చిన మంగ్లీ.. మైసమ్మ సాంగ్‌లోని పూర్తి లిరిక్స్‌ను మార్చేసి కొత్త సాంగ్‌ను విడుదల చేశారు. మార్చిన సాంగ్‌ను యూట్యూబ్‌లో అఫ్‌లోడ్ చేసిస మంగ్లీ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ రాసారు.. జానపద నేపథ్యం కలిగిన పాటకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ, ఆమె ఏమన్నారంటే… ఆమె మాటల్లోనే…

“ నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికీ నా నమస్కారాలు.. ఈ సంవత్సరం నేను పాడిన బోనాల పాట గురించి చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు, 80 సంవత్సరాలు కలిగిన పెద్దాయన పాలమూరు రామస్వామి గారు 25 ఏళ్ళ క్రితమే రచించారు. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది. 2008లో ఈ పాటను DRC ఆడియో సంస్థ సిడీ రూపంలో కూడా విడుదల చేశారు. ఆ పెద్దాయన రాసిన జానపదాలు నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకోవడం జరిగింది. ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించాము. 300 జానపదాలతోపాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్ని నిందాస్తుతిలోనే ఉన్నాయి.”

‘‘చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ’’ అని సాగే ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు, పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాము. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాము.

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు, పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా (సాతి భవాని) పండగల్లో పకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వొచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకున్న గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము.

నేను సింగర్ గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వళ్ళనే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో ఆంజనేయ స్వామి గుడికట్టించాను. మా తాతలనాటి ఆంజనేయస్వామి విగ్రహానికి గుడికట్టించి నేడు ధూప దీప, నైవేద్యాలతో పూజలు చేస్తున్నాము. నీకు గుడికట్టించే ధైర్యం, పేరు నాకు ఇవ్వాలి స్వామి అని మొక్కుకున్నాను. ఆ దేవుని దయవల్ల గత ఏడాది నవంబర్ 19న నా మొక్కును తీర్చుకున్నాను. ఏనాడు గుడికి వెళ్లని వాళ్లు, బోనం ఎత్తని వాళ్లు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలి.

గత నాలుగేళ్లుగా ప్రతీ ఏటా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈసారి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్ళి మరీ చిత్రీకరించాము. ప్రతి పండగలో నా పాటల ద్వారా నేను మీ ఇంటి భాగస్వామినయ్యాను. నా పాటను ఆదరించారు, అభినందించారు. నన్ను మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులోపెట్టుకున్నారు. ఇంత అదృష్టం, అవకాశం కల్పించిన మీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క రోజులో నేను ఫేమస్ కాలేదు. నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు. గ్రామదేవతలను ఎలా కొలుస్తారు, మైసమ్మ కొలుపు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకొని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది.

ఈ పోస్టు నా మనసుకు బాధకలిగించిన వారికోసము, నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసం.. ఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాటకోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయిత రామస్వామిగారిని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశాము. నన్ను వ్యతిరేకించినవారు, నిందించినవారు అందరూ కూడా నా వాళ్ళే అనుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ కొత్త పాట వీడియోను మీ ముందకు తీసుకువస్తున్నాను. ఈ పాటను కూడా ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ…..మీ ఆదరణ అభిమానం ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తూ…నాకు సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు..”

జై హనుమాన్
మీ మంగ్లి

Read Also…  

Mangli Bonalu Song: సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. అభిమానుల రచ్చతో ఏం చేసిందంటే..?


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu