
మలయాళం సినీ ఇండస్ట్రీలో నటికి లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనను వేధించినట్టు సంచలన ఆరోపణలు చేశారు నటి రిని జార్జ్. హోటల్‌కు రావాలని మెసేజ్ పంపించారని మాజీ జర్నలిస్ట్, మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఆరోపించారు. తరచుగా తనను వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. తన లాగే ఇతరులకు ఇలాంటి సమస్య రావద్దన్న ఉద్దేశ్యంతో బయటకు వచ్చినట్టు రిని జార్జ్ తెలిపారు. ఈ సంఘటన దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిందని రిని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కొచ్చిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ రాజకీయ నాయకుడి పేరు చెప్పని రిని.. ఆ వ్యక్తిపై తన పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా పట్టించుకోలేదని చెప్పారు.. ఇంకా చాలా మంది మహిళలకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొంది.
“అతను నాకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. నేను వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోయాను.. అది నాకు పెద్ద సమస్య కాదు. అందుకే నేను పోలీసు కేసు పెట్టలేదు. కానీ ఇటీవల ఈ వ్యక్తి ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు చూసినప్పుడు, ఇతర మహిళలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని నేను గ్రహించాను. అయినప్పటికీ, ఒక్క మహిళ కూడా దాని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. నేను మాట్లాడాలని నాకు అనిపించింది” అని నటి రిని ఆన్ జార్జ్ చెప్పింది. “అతని చుట్టూ భారీ రక్షణ కవచం ఉంది. నేను అతనిపై ఫిర్యాదు చేస్తానని ఒకసారి చెప్పినప్పుడు, అతను ‘‘వెళ్లి ఫిర్యాదు చేయండి’’ అని బదులిచ్చాడని పేర్కొంది. అతని గురించి ఫిర్యాదు చేసినా ఏం జరగలేదని.. తాను చేయ్యాల్సినదంతా చేశానని పేర్కొంది. అయితే, ఆ ఎమ్మెల్యే పేరు వెల్లడించడానికి రిని జార్జ్ నిరాకరించారు.
కాగా.. నటి రిని జార్జ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కుతాతిల్ వేధించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. కొచ్చిలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు రాహుల్ మమ్కుతాతిల్. ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపారు. రాహుల్ మమ్కుతాతిల్ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం తరువాత యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.