వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి.. ఈ ఏడాది హిట్ మూవీల లిస్ట్‌ల చేరిపోయింది. కాగా తాజాగా ఈ మూవీకి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గానూ ‘మోస్ట్ ఇన్‌ఫ్లూయన్సల్ మూమెంట్స్ ఆఫ్ ట్విట్టర్’లో ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఇందులో అజిత్ నటించిన ‘విశ్వాసం’ మొదటిస్థానంలో ఉండగా.. ‘లోక్‌సభ ఎలక్షన్స్ 2019’, ‘సీడబ్ల్యూసీ 19’లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఐదో స్థానంలో ‘దీపావళి’ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
కాగా గతేడాది కూడా అజిత్, మహేష్ మూవీలు ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నాయి. అజిత్ నటించిన ‘విశ్వాసం’, మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రాలు ‘బిగ్గెస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా’లో చోటు సంపాదించుకున్నాయి. దీంతో కోలీవుడ్‌లో అజిత్.. టాలీవుడ్‌లో మహేష్ వరుసగా ఈ ఘనత దక్కించుకున్న లిస్ట్‌లో చేరిపోయారు. ఇక ‘విశ్వాసం’ హ్యాష్‌ట్యాగ్ గతేడాది, ఈ ఏడాది రెండుసార్లు చోటు దక్కించుకోవడం మరో విశేషం.
కాగా ఫ్రెండ్‌షిప్, రైతుల కథాంశం నేపథ్యంలో ‘మహర్షి’ తెరకెక్కింది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.170కోట్ల రూపాయలను వసూలు చేసింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.