వరుసగా హారర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి మే 1న సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపారు. ముని సిరీస్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో కాంచన 3పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.