తిరువనంతపురం, మార్చి 22: క్లాసికల్ డ్యాన్సర్ కళామండలం సత్యభామ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ పురుష డ్యాన్సర్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నారు. అతని రంగు కాకిలా నల్లగా ఉంటుందని, ఆ వ్యక్తి కళను ప్రదర్శించేటప్పుడు వికృతంగా కనిపిస్తాడని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే..
క్లాసికల్ డ్యాన్సర్ కళామండలం సత్యభామ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మోహినియాట్టాన్ని ‘మోహినిలు’ (అందమైన మహిళలు) మాత్రమే ప్రదర్శించాలి. అది పురుషులకు సరిపోదు. క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు పురుషులు అసహ్యంగా కనిపిస్తారని పేర్కొన్నారు. అయితే ఆ మేల్ డ్యాన్సర్ ఎవరనేది చెప్పలేదు. సత్యభామ చేసిన వ్యాఖ్యలు తన గురించేనని ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్, దివంగత మలయాళ నటుడు కళాభవన్ మణి సోదరుడు ఆర్‌ఎల్‌వి రామకృష్ణన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కళామండలం అనే ట్యాగ్ కూడా ఈ పోస్టుకు జోడించారు. ‘ఓ ఆర్టిస్ట్ తనను పదేపదే అవమానిస్తూనే ఉంది. ఇంతకు ముందు నేను కళామండలంలో ఉన్నప్పుడు కూడా ఈ గౌరవనీయురాలైన గురువు నన్ను అవమానించారు. నేను మోహినియాట్టం చేయడం, పీహెచ్‌డీ చేయడం ఆమెకు అస్సలు ఇష్టం లేదని’ రామకృష్ణన్ ఫేస్ బుక్ పోస్టులో రాసుకొచ్చారు. ‘ఇలాంటి వారి వల్లే షెడ్యూల్డ్ కులానికి చెందిన కళాకారులు నేడు నాట్యరంగంలో కొనసాగలేకపోతున్నారని, అలాంటి కుళ్లిన మనసులున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలని’ పోస్టులో పేర్కొన్నారు.
కాగా కళామండలం, RLV అనేవి కేరళలోని ప్రముఖ ప్రదర్శన కళా సంస్థలు (performing arts institutes). మరోవైపు అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష కాంగ్రెస్ సత్యభామ వ్యాఖ్యలను ఖండించాయి. డ్యాన్సర్ రామకృష్ణన్‌కు తమ మద్దతును తెలిపాయి. రామకృష్ణన్‌కు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేరళ సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. దీనిపై ఆమె భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) యువజన విభాగం డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్‌ఐ రామకృష్ణ నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అయితే క్లాసికల్ డ్యాన్సర్ సత్యభామ వ్యాఖ్యలపై విమర్శలు వెళ్లువెత్తుతున్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని తెగేసి చెప్పారు. తన వ్యాఖ్యలు ఏ వ్యక్తిని ఉద్దేశించి చేయలేదని అన్నారు. పర్ఫామింగ్ ఆర్ట్స్‌పై ‘నాట్యశాస్త్రం’లో తాను నేర్చుకున్న విషయాలను ఉటంకించినట్లు ఆమె చెప్పారు. మంచి డ్యాన్సర్‌కు మంచి శరీర రంగు ఉండాలా? అని ప్రశ్నించగా.. డ్యాన్స్‌కి శరీర సౌందర్యం చాలా ముఖ్యమని ఆమె సమాధానం చెప్పారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.