
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఓవైపు ఈ సినిమాలో వీఎఫెక్స్ బాగాలేదంటూ, మరోవైపు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అనంతరం చిత్ర యూనిట్ 3డీ వెర్షన్‌ను విడుదల చేయడం, దర్శకుడు ఇచ్చిన స్పష్టతతో మళ్లీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.
ఇదిలా ఉంటే ఆదిపురుష్‌లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా సంక్రాతి బరిలో తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, ఏజెంట్ చిత్రాలు ఉండడమే. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు బరిలో ఉండడం వల్ల ఆదిపురుష్‌ను రెండు వారాలకు వాయిదా వేయాలనే ప్రపోజల్స్ వచ్చినట్లు సమాచారం.
అయితే మరోవైపు ఆదిపురుష్ టీమ్ మాత్రం సినిమాను వాయిదా వేసే ఆలోచనలో లేదని తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సంక్రాంతికే సినిమాను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారని టాక్. ఇంతకీ ఆదిపురుష్ అనుకున్న సమయానికి వస్తాడా.? లేదా వాయిదా పడనుందా.? తేలాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..