
ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇన్నేళ్లుగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఇమ్మడి రవి.. ఐ-బొమ్మ సైట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, సినిమా పైరసీ అంశంలో ఐబొమ్మ, మూవీరుల్జ్ సైటులు గత కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్‌ను, అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలను పైరసీ చేస్తూ తమ సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నాయి.
తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు.. సైట్ మాస్టర్ మైండ్‌ను వెతికే పనిలో పడ్డారు. అలాగే గతంలో దమ్ముంటే పట్టుకోవాలంటూ ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎట్టికేలకు ఊసలు లెక్కపెడుతున్నాడు. భార్యతో విడిపోయి ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. రవి అకౌంట్‌లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అలాగే సర్వర్లలోని పైరసీ కంటెంట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.