పార్టీలకు అందుకే దూరం..! భర్త అలవాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో కాలంగా కొనసాగుతున్న ఓ హీరోయిన్​ తాజాగా తన మాతృత్వ అనుభవాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా గత ఎనిమిదేళ్లుగా తాను ఒక్కసారి కూడా మధ్యాహ్నం నిద్రపోలేదని, కానీ తన భర్త మాత్రం ప్రతిరోజూ హాయిగా నిద్రపోతాడని సరదాగా వ్యాఖ్యానించింది.

పార్టీలకు అందుకే దూరం..! భర్త అలవాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ
Neha Dhupia1.jpg

Updated on: May 04, 2026 | 6:30 AM

ఒక పాపులర్ కామెడీ షో హోస్టుల పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్టార్ బ్యూటీ నేహా దూపియా తన కుటుంబం, స్నేహితులు, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పిల్లలు పుట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని, స్నేహితులను కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది. ఆమె పంచుకున్న ఈ మాతృత్వపు విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మాతృత్వపు అనుభవాలు

తాజాగా భారతీ సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నేహా తన వ్యక్తిగత జీవితంపై మనసు విప్పి మాట్లాడింది. “పిల్లలు పుట్టిన తర్వాత నా స్నేహితులలో చాలా మందిని కోల్పోయాను. ఎందుకంటే ఆ సమయంలో మనకు అస్సలు ఖాళీ సమయం దొరకదు. అలసిపోయిన తల్లిగా అనిపించినప్పుడు నాపై నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలని భావిస్తాను” అని చాలా నిజాయితీగా అంగీకరించింది. ఆమె భర్త మాట్లాడుతూ ఆమె ఎప్పుడూ పిల్లలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపాడు. కానీ ఆమె మాత్రం తన మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ తన కుటుంబం, ఆ తర్వాత తన కెరీర్ అని స్పష్టం చేసింది. పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు తన పిల్లల కోసం తక్కువ పని గంటలు కేటాయించాలని కోరుతున్నట్లు వెల్లడించింది.

మధ్యాహ్నం నిద్ర

నేహ తన భర్త అంగద్​ బేడి గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. “మాకు పెళ్లై, పిల్లలు పుట్టిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో నేను ఒక్కసారి కూడా మధ్యాహ్నం నిద్రపోలేదు. కానీ నా భర్త మాత్రం ప్రతిరోజూ మధ్యాహ్నం హాయిగా నిద్రపోతాడు. అది చూసినప్పుడు నాకు చాలా అసూయగా అనిపిస్తుంది” అని నవ్వుతూ చెప్పింది. పిల్లల కోసం రాత్రి 7 గంటల తర్వాత జరిగే పార్టీలు, బయట తిరగడాలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు పేర్కొంది. పని కోసం ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తనలో ‘మమ్ గిల్ట్’ (తల్లిగా పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నాననే బాధ) కలుగుతుందని ఎమోషనల్ అయ్యింది.

ఈ దంపతుల ప్రేమ కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట ఒక జిమ్‌లో ఆమెను చూసిన అంగద్​, ఆ తర్వాత ఒక పార్టీలో ఆమెను కలిశాడు. ఆమె ద్వారా ఒక చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు, ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చనే ఉద్దేశంతో ఆ పాత్రను అంగీకరించాడట. ఆ షూటింగ్ సమయంలోనే తన ప్రేమను వ్యక్తపరిచాడట. అయితే ఆమె మొదట ఎనిమిది సార్లు అతని ప్రతిపాదనను తిరస్కరించడం విశేషం. చివరకు ఎన్నో ప్రయత్నాల తర్వాత 2018లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అదే ఏడాది వీరికి కూతురు మెహర్, 2021లో కొడుకు గురిక్ జన్మించారు.

Follow Us