Adnan Sami: 16 నెలల్లో 120 కేజీలు తగ్గిన స్టార్ సింగర్ అద్నాన్‌ సమీ.. ఎలాగో తెలుసా?

ప్రముఖ సింగర్​ అద్నాన్​ సమి బరువు ఒకప్పుడు 230 కేజీలు దాటిపోయింది. లిఫ్ట్‌లోకి ఎక్కాలంటే ఇద్దరు పక్కన నిలబడితే స్థలం సమస్య. విమానంలో సీట్ బెల్ట్ సైతం సరిపడేది కాదు. డాక్టర్లు చివరిసారిగా ‘మీకు రెండేళ్లే టైమ్ ఉంది. బరువు తగ్గకపోతే ..

Adnan Sami: 16 నెలల్లో 120 కేజీలు తగ్గిన స్టార్ సింగర్ అద్నాన్‌ సమీ.. ఎలాగో తెలుసా?
Adnan Sami Weightloss Journey

Edited By: Janardhan Veluru

Updated on: Dec 01, 2025 | 12:10 PM

ప్రముఖ సింగర్​ అద్నాన్​ సమి బరువు ఒకప్పుడు 230 కేజీలు దాటిపోయింది. లిఫ్ట్‌లోకి ఎక్కాలంటే ఇద్దరు పక్కన నిలబడితే స్థలం సమస్య. విమానంలో సీట్ బెల్ట్ సైతం సరిపడేది కాదు. డాక్టర్లు చివరిసారిగా ‘మీకు రెండేళ్లే టైమ్ ఉంది. బరువు తగ్గకపోతే గుండె ఆగిపోతుంది.’ అని హెచ్చరించారు. ఆ మాటలు విని అద్నాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ నీళ్లలో భయం కంటే ధైర్యం ఎక్కువైంది. ‘నేను బతకాలి… ఇంకా చాలా పాటలు పాడాలి’ అని మనసులో గట్టిగా అనుకున్నాడు. అలా మొదలైంది ఒక అద్భుత ప్రయాణం.

కేవలం 16 నెలల్లోనే 120 కేజీలు తగ్గాడు. బేరియాట్రిక్ సర్జరీ లేదు, ఫ్యాడ్ డైట్ లేదు, మందులు లేవు. కేవలం ఒకే ఒక నియమం – అన్నం లేదు, రొట్టె లేదు, చక్కెర లేదు. ఈ మూడింటినీ జీవితం నుంచి పూర్తిగా తొలగించేశాడు. ఉదయం గుడ్డు తెల్లసొన, కొద్దిగా ఓట్స్, నల్ల కాఫీ. మధ్యాహ్నం, రాత్రి గ్రిల్ చేసిన చికెన్ లేదా చేప, పచ్చని కూరగాయలు, పెద్ద గిన్నె సలాడ్. మధ్యలో బాదం, గ్రీక్ పెరుగు, రోజుకు ఏడు ఎనిమిది లీటర్ల నీరు. ఆకలి బాధ లేదు, రుచి మరచిపోలేదు. కానీ ఆ రుచి తనను చంపేస్తోందని గ్రహించాడు. జిమ్‌లో రోజుకు నాలుగు గంటలు కష్టపడ్డాడు. కార్డియో, వెయిట్స్, యోగా.. అన్నీ కలిపి నెలకు ఏడు ఎనిమిది కేజీలు స్థిరంగా తగ్గుతూ వచ్చాడు. నడుము 52 ఇంచెస్ నుంచి 32 ఇంచెస్‌కు, షర్ట్ సైజ్ 5XL నుంచి Sకు వచ్చింది.

ఆశ్చర్యం ఏంటంటే బరువు తగ్గాక అతని గొంతు మరింత స్వచ్ఛంగా, శక్తివంతంగా మారింది. శ్వాస ఎక్కువసేపు పడుతోంది, హై స్కేల్​లోనూ సులభంగా పాడగలుగుతున్నాడు. స్టేజ్ మీద ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో అభిమానులను అలరిస్తున్నాడు. తన వెయిట్​లాస్​ జర్నీ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఆహారాన్ని ప్రేమించాను. కానీ ఆ ప్రేమ నన్ను చంపేస్తోందని తెలిసాక… ఆ ప్రేమను వదిలేశాను. ఇప్పుడు నేను నన్ను నేను ప్రేమిస్తున్నాను.’ అంటున్నాడు అద్నాన్​. 230 కేజీల శరీరంలో బంధీ అయిన అద్నాన్​ ఇవాళ 85 కేజీలతో స్వేచ్ఛగా పాడుతున్నాడు. ఇది బరువు తగ్గిన కథ కాదు – ఇష్టాలను, అలవాట్లను జయించిన మనిషి కథ. మీరూ అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే అద్నాన్​ను ఆదర్శంగా తీసుకుని మీరు ట్రై చేయండి!