పాతబస్తీలో నిహారిక సందడి.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందడి రోజురోజుకూ మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది. మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో జరుగుతున్న 217వ వార్షిక బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు సినీ నటి నిహారిక కొణిదెల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు. నిహారిక రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు సెల్ఫీలు, ఫొటోల కోసం ఆసక్తి చూపగా, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేసి దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టారు.
అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ తనను ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే “నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది” అని సరదాగా అన్నానని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు.
“అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. ఈరోజు దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జరిగింది. అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించింది. మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను” అని నిహారిక అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుండగా, ప్రముఖులు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆయన ఆనవాయితీగా వస్తుంది పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
