
నరేశ్, పవిత్రలు జోడిగా తెరకెక్కిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పటి నుంచీ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. నరేశ్ జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమాకు కథాంశమని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఈ స్టోరీ తమది కాదంటూ నరేశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఈ చిత్రంలో దర్శకుడు ఎంఎస్ రాజు ఏ అంశాలను చూపించాలనుకున్నారు.? ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నారు.? అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంఎస్ రాజు ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 26న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఎంఎస్‌రాజు.. మళ్ళీ పెళ్లిలో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్ అంశాలు ఉన్నాయని, తన కెరీర్‌లో ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్ విజయ కృష్ణ మూవీస్. నరేశ్‌గారి 50 ఏళ్ల కెరీర్‌ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు’ అని చెప్పుకొచ్చారు.
ఇక మళ్లీ పెళ్లి చిత్రంలో ఒంటరితనం అనేది ఎలా ఉంటుందన్న అంశాలను చూపించామని చెప్పుకొచ్చారు. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవేనని, డర్టీ హరి చిత్రాన్ని చేయమని ఓ యంగ్ డైరెక్టర్‌ను అడిగితే అతనను చేయనడడంతో స్వయంగా తానే దర్శకత్వం వహించానని, కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారానని, లేదంటే ఇంట్లో కూర్చునే వాడినని ఎంఎస్‌రాజు చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..