
భుజం తట్టి.. గట్టోడివి అనిపించుకుంటే.. అందులో వుండే కిక్కే వేరు. సామాన్యుడికైనా, సూపర్‌స్టార్‌కైనా లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయే కాంప్లిమెంట్ అది. ఇవాళ హీరో మహేష్‌బాబుని అదేవిధంగా భుజం తట్టి మెచ్చుకోబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి మూడు దశాబ్దాల కిందటి ఒక అపురూపమైన జ్ఞాపకమే ఆధారమట. అదేంటంటే..!
‘‘ఇప్పుడేమో ఇంతవాడ్ని.. రేపు అవుతా మీ అంతవాడ్ని..!’’ అని పాట రూపంలో ఇచ్చిన మాటను నిజం చేసి చూపించారు హీరో మహేష్‌బాబు. 30 ఏళ్ల కిందట 1989లో వచ్చిన ‘గూఢచారి 117’ మూవీలో తండ్రితో కలిసి నటించారు మహేష్‌బాబు. ‘‘ఇంత చిన్నవాడివి.. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావే..’’ అంటూ తండ్రి చేత ముచ్చటగా చివాట్లు కూడా పెట్టించుకున్నాడు నాటి లిటిల్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు. కట్ చేస్తే అప్పట్లో చెన్నైలో విజయకృష్ణా థియేటర్లో ఈ సినిమా ప్రివ్యూ వేసి మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా చూపించారట కృష్ణ.
సినిమాను చూసిన చిరు.. వీడు ఖచ్చితంగా మీ అంతటివాడు అవుతాడు. చూస్తూ ఉండండి.. అని మహేష్ ఫ్యూచర్‌ని ముందే పసిగట్టి చెప్పేశారట మెగాస్టార్ చిరంజీవి. కాలక్రమంలో అదే నిజమైంది. యువరాజుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కట్‌చేస్తే.. ఇప్పుడు మళ్లీ సూపర్‌స్టార్ స్టేచర్‌తో.. మెగాస్టార్ ఎదురుగా నిలబడబోతున్నారు మహర్షి మహేష్‌బాబు.
ఎన్నెన్నో అనుకుంటాం.. అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి..? అని నిట్టూర్చకుండా కష్టపడి ఇక్కడిదాకా ఎదిగిన మహేష్‌బాబు.. తండ్రికి తగ్గ కొడుకనిపించుకున్నారు. ఇవాళ సూపర్‌స్టార్‌కి మెగాస్టార్ ఇవ్వబోతున్న కాంప్లిమెంట్ కూడా సరిగ్గా ఇదేనా..?