అది ఆడియన్స్ నిర్ణయిస్తారు..! నెపోటిజంపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్!
సినీ పరిశ్రమలో నెపోటిజమ్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తెరవెనుక రాజకీయాలు, వారసత్వ నేపథ్యం ఉన్న వారికి సులభంగా అవకాశాలు వస్తాయనే విమర్శలు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. అయితే, ఈ విషయాలపై తనదైన శైలిలో స్పందించింది ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటి. తన కల ..

సినీ పరిశ్రమలో నెపోటిజమ్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తెరవెనుక రాజకీయాలు, వారసత్వ నేపథ్యం ఉన్న వారికి సులభంగా అవకాశాలు వస్తాయనే విమర్శలు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. అయితే, ఈ విషయాలపై తనదైన శైలిలో స్పందించింది ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటి. తన కల చాలా పెద్దదని, సాధించలేనిది అని భావించే ప్రతి అమ్మాయితో తాను మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పిన ఈ భామ.. ఇండస్ట్రీలో ఎవరు నిలబడాలి, ఎవరు వెళ్లాలి అనే విషయం కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇంతకీ ఎవరా నటి?
ఆ నటి మరెవరో కాదు ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ భామ ఆలియా భట్. ‘ఆల్ఫా’ అనే యాక్షన్ మూవీతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఆలియా భట్.. తాజాగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. ఈ వేదికపై ఆమె అంతర్జాతీయ సినిమాకు చేసిన కృషికి గాను గోల్డెన్ గ్లోబ్స్ హారిజన్ అవార్డ్ తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒత్తిడి కాదని, అది గౌరవం, గర్వం అని ఆలియా పేర్కొంది. ఎంత గొప్పగా కనిపించినా, ఆ గ్లామర్ ఒక రాత్రి పిజ్జా తింటూ, పైజామాలో ముగుస్తుంది అని నవ్వుతూ చెప్పింది.

Bollywood Star Alia Bhatt
సినీ పరిశ్రమలో బంధుప్రీతి గురించి జరుగుతున్న చర్చల గురించి ఆలియా స్పందిస్తూ.. “ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు వెళ్లాలో నిర్ణయించేది ప్రేక్షకులే” అని స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. కూతురు రాహా తమ జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయని, ‘అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు’ అని అడిగే వయసులో రాహా ఉందని, అందుకే రోజూ తన ప్రయాణం భావోద్వేగంగా మారుతుందని తెలిపింది. తాను తల్లి అయినప్పటికీ, ప్రపంచాన్ని చుట్టి వచ్చినప్పటికీ, విజయాలు సాధించినా.. తనని తాను ఒక విషయంలో కోల్పోకూడదనుకుంటున్నా అని, అదేంటంటే.. ఏం జరిగినా ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలనుకుంటున్నా అని ఆలియా చెప్పింది.
చిన్న వయసులో తనకు ఉన్న ఉత్సాహం, శక్తి అద్భుతమని, 17-18 ఏళ్ల వయసులో భయం, సంకోచం లేకుండా ప్రతిదీ చేయాలనుకునేదాన్ని అని చెప్పింది. కాలక్రమేణా విజయం వైఫల్యం రెండూ తన ఆలోచనా ధోరణిని మార్చాయని, కొన్నిసార్లు ఫలితాల గురించి పట్టించుకోకుండా తనకు అన్నీ ఇచ్చిన ఆ 18 ఏళ్ల అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది అని ఆలియా తనలోని బాల్యాన్ని గుర్తు చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్స్ గుర్తింపు పొందడం గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో శక్తిమంతమైన, అర్హులైన మహిళల కథలను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాను అని ఆలియా భట్ తెలిపింది.
