బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రేమపక్షులు ఇప్పుడు ఏడడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొద్ది రోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తోన్న ప్రేమజంట హీరో సిద్దార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. వీరిద్దరి కొంతకాలంగా రిలేషన్ షిప్లో ఉన్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలోనూ వీరిద్దరు కలిసి కెమెరాకు చిక్కడం.. సిద్ధార్థ్ ఇంటికి కియారా వెళ్లడం వంటి విషయాలు వీరు ప్రేమలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇప్పుడు ఈ జంట దాంపత్య జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే ఇప్పటికే రాజస్థాన్‌కు ఇరు కుటుంబసభ్యులు చేరుకున్నారు. కియారా.. సిద్ధార్థ్ సైతం పెళ్లి వేడుకలకు వచ్చేశారు.
ఫిబ్రవరి 4,5,6 తేదీల్లో మూడు రోజుల పాటు.. మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు.. దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అయితే వీరి పెళ్లి అత్యంత ఖరీదుతో కూడుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి వివాహం జరుగుతున్న సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్ కు నిలయం. అతిథులకు విలాసమంతమైన హోటల్ గదులు.. బెడ్ రూమ్స్, పెద్ద తోటలు.. ఒక కృత్రిమ సరస్సు .. ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి మద్యం లేకుండా ఈ హోటల్ కు ఎప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో ఒక్కరోజు ఖరీదు రూ. 1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అలాగే అక్టోబర్ నుంచి మార్చి వరకు రోజుకు దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పుడు సిద్ధార్థ్, కియారా వివాహాం దాదాపు 3 రోజులు జరగనుంది. అంటే ఈ వేడుకకు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఖర్చులు కలిపి దాదాపు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన అన్ని ఖరీదైన వేడుకల్లో వీరి పెళ్లి వేడుక కూడా ఒకటి.