సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. అందం, అభినయం, అదృష్టం ఉన్న తారలు కొందరు ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటికీ వారి మరణాలు అంతుచిక్కని మిస్టరీలు. సంవత్సరాలు గడుస్తున్న వారి మరణాలపై క్లారిటీ రాలేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ దివ్య భారతి, సిల్క్ స్మిత, బాలీవుడ్ తార జియా ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి చాలా మంది తారల మృతిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ నటి మరణం కూడా ఇప్పటికీ వీడని మిస్టరీ. దాదాపు 13 ఏళ్ల క్రితం ఆమెతోపాటు తన కుటుంబం కూడా కనిపించకుండా పోయారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లతో కుటుంబంతోపాటు నటి మృతదేహం కుళ్లిన స్థితిలో బయటపడింది. ఇప్పుడు మరోసారి ఆ నటి పేరు తెరపైకి వచ్చింది. తన పేరు లైలా ఖాన్. అసలు పేరు రేష్మా పటేల్. కానీ సినిమాల్లోకి వచ్చాకా లైలా ఖాన్ గా పేరు మార్చుకుంది.
1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత లైలా ఖాని మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన లైలా.. రాజేశ్ ఖన్నాతో నటించిన వాఫా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. 2011లో జిన్నాత్ సినిమా నటిస్తున్న సమయంలోనే షూటింగ్ కు కాస్త్ బ్రేక్ రావడంతో కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లింది. ఆ తర్వాత లైలా ఖాన్ కుటుంబంతో కలిసి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి నాదిర్ పటేల్ తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్ లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఆమెకు ఫామ్ హౌస్ ఉందని తెలిసి అక్కడకు వెళ్లారు. కొన్ని నెలలకు కాశ్మీర్ ప్రాంతంలో వీరి వాహనం దొరకడంతో కేసు మరింత కష్టంగా మారింది. లైలా కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అదే సమయంలో ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్తి విషయంలో గొడవ జరగడంతో ముందుగా భార్య షెలీనాను చంపి.. ఆ తర్వాత లైలా, ఆమె అక్క అమీనా, కవల తోబుట్టువులు జారా, ఇమ్రాన్ అలాగే కజిన్ రేష్మాలను హత్య చేసినట్లు తెలిపాడు. అనంతరం బంగ్లా నుంచి కుళ్లిపోయిన మృతదేహాలను వెలికితీశారు. ఈ కేసులో షెలీనా ఇద్దరు మాజీ భర్తలతోపాటు 40 మందిని విచారించారు. తాజాగా ముంబాయి సెషన్ కోర్టు పర్వేజ్ తక్ ను దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి మే 14న శిక్ష ఖరారు చేయనుంది.