
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తన ఫిట్ నెస్ విషయంలో ఎంతో కఠినమైన ఆహార నియమాన్ని అనుసరిస్తానని.. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఒకే రకమైన భోజనం తీసుకున్నట్లు తెలిపారు. చికెన్ కీమా, సలాడ్, చిలగడ దుంపలు, క్వినోవా మాత్రమే తీసుకునేవాడినని.. తన డైట్ మార్చుకోకపోతే తన భార్య తనను వదిలేస్తానని బెదిరించిందని చెప్పుకొచ్చారు.
“నేను నా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటాను. డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను. గతంలో క్వినోవా ఎక్కువగా తీసుకునేవాడిని. ఇప్పుడు దానిని తీసుకోవడం లేదు. దాదాపు రెండేళ్లు ఒకే రకమైన డైట్ ఫాలో అయ్యాను. అవకాడో, బ్రెస్సెల్స్ మొలకలు, పాలకూర, ఆకు కూరలు, కీమా, చిలగడదుంపలు మాత్రమే తీసుకున్నాను. భోజనం, లంచ్, డిన్నర్ అన్నింటిలోనూ ఒకరకమైన డైట్ ఫాలో అయ్యాను. నా డైట్ చూసి నా భార్య ఎంతో విసిగిపోయింది. డైట్ మార్చుకోకపోతే నన్ను విదిలేస్తానని బెదిరించింది. కాకపోతే ఇప్పటివరకు ఆ పని మాత్రం చేయలేదు. నేను తినే ఆహారం తను అస్సలు తినదు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇమ్రాన్ ప్రస్తుతం షో టైమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దీనికి అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో మౌనీ రాయ్, నసీరుద్దీన్ షా, మహిమా మక్వానా, శ్రియా శరణ్, రాజీవ్ ఖండేల్వాల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 8న స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.