Pallavi Prashanth: విపరీతమైన అమాయకత్వం.. కొంచెం అహంకారం
వాస్తవానికి పల్లవి ప్రశాంత్‌ది మితిమీరిన అమాయకత్వం. కొంచెం అహంకారం. బిగ్ బాస్ ఇంట్లో చెలరేగి ఆడి.. విజేతగా నిలిచాడు. విపరీతమైన పిచ్చితో బిగ్ బాస్‌కు వెళ్లి గెలిచిన ప్రశాంత్.. ప్రతి గేమ్‌లోనూ ప్రాణం పెట్టి ఆడి.. గెలిచిన అనతరం తన విజయాన్ని గొప్పగా చాటాలనుకున్నాడు. తనను గెలిపించిన వాళ్లకు అభివాదం చేద్దామనుకున్నాడు. కానీ బయట పరిస్థితి పూర్తిగా అతనికి తెలీదు. పోలీసుల మాటను కాదని.. కొద్దిగా అహంకారం ప్రదర్శించి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.
మొన్నటివరకు బిగ్‌బాస్ హౌస్‌లో… ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో… ఇదీ పల్లవి ప్రశాంత్ ప్రస్తుత పరిస్థితి. బిగ్‌బాస్ ఫైనల్ రోజున హైదరాబాద్ రోడ్లపై విధ్వంసానికి, అల్లర్లకు కొంతమేర కారణమైన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయ్. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు రాజు, మరికొందరిపై కేసులు పెట్టారు పోలీసులు. దాంతో, బిగ్‌బాస్ విన్నర్‌గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు జేజేలు పలికిన వాళ్లే… ఇదేం పని ప్రశాంత్ అనే పరిస్థితి వచ్చింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత డ్రామా ఉంటుందో… టైటిల్ గెలిచిన తర్వాత అంతకుమించిన హైడ్రామా నడిచింది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో కూడా పెద్ద డ్రామా జరిగింది. చివరికి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఓన్ హౌస్‌కి వెళ్లిన పల్లవిని… ఇప్పుడు జైలర్ హౌస్‌కి తరలించారు పోలీసులు. బిగ్‌బాస్ విజేతగా అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చాక కొద్దిగా ఆతృతతో వ్యవహరించాడు పల్లవి ప్రశాంత్. అప్పటికే అక్కడకు తరలివచ్చిన వేలాదిమంది అభిమానులకు సర్దిచెప్పాల్సింది పోయి… వాళ్లను కలిసేందుకు, ర్యాలీ తీసేందుకు యత్నించాడు. పోలీసుల మాటను వినకుండా రోడ్లపై ఫ్యాన్స్‌ను కలిసేందుకు ట్రై చేశాడు. దాంతో, రెచ్చిపోయిన ప్రశాంత్ ఫ్యాన్స్… విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్సులు, కార్లపై దాడిచేసి ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి పెద్దఎత్తున పోలీసులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అయినా కూడా సిట్యువేషన్ కంట్రోల్ తప్పడంతో పెను విధ్వంసం జరిగింది.
తన అరెస్టుకు ముందు టీవీ9తో మాట్లాడాడు పల్లవి ప్రశాంత్. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అసలేం జరిగిందో చెప్పాడు. పోలీసుల మాట తాను వినకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నాడు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆ ఐదుగురి ఫొటోలు బయటపెడతానంటున్నాడు పల్లవి ప్రశాంత్. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు, దానికి తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. అంతమంది రావడంతో ఏం చేయాలో నాకు కూడా అర్థంకాలేదన్నాడు. తన కోసం అంతమంది వస్తే… దొంగ మాదిరిగా వెనుక గేట్ నుంచి వెళ్లనని చెప్పా, కానీ పోలీసుల మాటల్ని అర్థం చేసుకోలేకపోయానంటూ అసలు విషయం బయటపెట్టాడు.
బిగ్‌బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు కంప్లైంట్ చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్. సీపీఐ నేత నారాయణ కూడా… బిగ్‌బాస్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాక్షన్ తీసుకోవాల్సింది ప్రశాంత్‌పై కాదు… బిగ్‌బాస్ షో నిర్వాహకులపై అంటున్నారు సీపీఐ నారాయణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.