AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..

సుపరిచితుడైన నటుడు సయాజీ షిండే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సయాజీ, వాచ్‌మెన్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు.

Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..
Actor Sayaji Shinde
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2026 | 2:08 PM

Share

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సయాజీ షిండే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని ఒడిదొడుకులను, ముఖ్యంగా తన నటనా ప్రయాణానికి ముందు పడిన కష్టాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా, మహాబలేశ్వర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న ఆయన కుటుంబంలో, సయాజీ చిన్నప్పటి నుండి కష్టాలను చూస్తూ పెరిగారు. ఏడవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుని, ఆ తర్వాత అక్క గ్రామానికి వెళ్లి పదవ తరగతి పూర్తి చేశారు. ఉపాధ్యాయుడు కావాలనే ఆశయంతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (D.Ed) కూడా పూర్తి చేశారు.

అయితే, కన్హేర్ డ్యామ్ ప్రాజెక్టు కారణంగా వారి కుటుంబం తమ భూమిని కోల్పోయింది. ఇదే సమయంలో సయాజీకి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ ఉద్యోగం లభించింది. అది 1978-79 మధ్య కాలం. రాత్రిపూట వాచ్‌మెన్‌గా పని చేస్తూ, పగలు కాలేజీకి వెళ్లి తన చదువును కొనసాగించారు. ఈ అనుభవం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆ తర్వాత అదే డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఒక సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ, సయాజీకి నటుడిగా మారాలనే కల బలంగా ఉండేది. ఈ కలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ముంబైకి బయలుదేరారు.

ముంబైలో జీవనం సాగించడానికి మొదట ఒక బ్యాంకులో క్లర్క్‌గా చేరారు, అప్పట్లో నెలకు కేవలం 250 రూపాయలు మాత్రమే జీతం. ఆరు నెలల తర్వాత, ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి, తన పూర్తి సమయాన్ని నటనకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. “మంచి ప్రారంభం అంటే సగం పని పూర్తయినట్లే”, “తొందరగా ఎదిగేవారు తొందరగానే పడిపోతారు” అనే సూత్రాలను నమ్ముతూ, తొందరగా డబ్బు సంపాదించడానికో, ప్రసిద్ధి పొందడానికో కాకుండా, ఒక మంచి నటుడిగా మారడానికి పదేళ్ల పాటు తీవ్రంగా కృషి చేశారు.

ముంబైలో ఆయన దినచర్య చాలా కఠినంగా ఉండేది. ఉదయం 5 గంటలకే నిద్ర లేచి, 5:30 కల్లా దాదర్‌కు చేరుకుని, 7 నుండి 8 గంటల వరకు గాత్ర సాధన, నటన వర్క్‌షాప్‌లలో పాల్గొనేవారు. ఆ తర్వాత 8:30 నుండి 12 గంటల వరకు బ్యాంకులో పని చేసేవారు. మధ్యాహ్నం 3:30 వరకు లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ, నటనకు సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ గడిపేవారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6:30-7 గంటల వరకు బ్యాంకులో పని చేసి, ఆ తర్వాత డ్రామా, నటనకు సంబంధించిన సమావేశాలలో పాల్గొనేవారు. రాత్రి 9 గంటల వరకు ఈ పనులలో నిమగ్నమై, 10-10:30 గంటలకు నిద్రపోయి, మళ్లీ మరుసటి రోజు అదే దినచర్యను కొనసాగించేవారు.

1982లో ముంబైకి వచ్చిన సయాజీ షిండే, 1987లో తన మొదటి డ్రామాలో నటించారు. ఆ తర్వాత 1991లో రెండో డ్రామా, 1995లో మొదటి మరాఠీ చిత్రం, 2000లో హిందీ చిత్రం, 2001లో తమిళ చిత్రం, ఆపై తెలుగు చిత్రాల్లో నటించి అంచెలంచెలుగా ఎదిగారు. తన జీవితంలో కష్టాలు పడిన రోజులను గుర్తు చేసుకుంటూ, అప్పట్లో సాధారణ దుస్తుల్లో ఉండటంతో చాలా మంది తనను చూసి నవ్వేవారని, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, తన నిజాయితీ, నిబద్ధత ఫలితమే ఈ విజయమని సంతోషంగా చెప్పుకున్నారు. “తిన్నమా, పడుకున్నమా, తెల్లారిందా” వంటి తన ప్రసిద్ధ డైలాగులతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సయాజీ షిండే, నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.తన జీవితాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్చేశారని అన్నారు.

Follow Us