West Bengal Election 2021: కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. బెంగాల్‌లో పెరుగుతున్న కేసులు
Rezaul Haque: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలను మొత్తం ఎనిమిది విడతల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియగా.. మరో నాలుగు దశల్లో
Rezaul Haque: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలను మొత్తం ఎనిమిది విడతల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియగా.. మరో నాలుగు దశల్లో పోలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కరోనావైరస్ బారినపడి గురువారం ఉదయం కన్ను మూశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని షంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి మొహ్మద్ రెజావుల్ హక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా మొదట జంగిపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రెజావుల్ హక్ పరిస్థితి క్షీణించడంతో ఆయన్ను కోల్‌కతాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఐదు గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కార్యదర్శి రోహన్ మిత్ర వెల్లడించారు. కాగా.. ముర్షిదాబాద్‌లో ఏడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఇంకా నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో బెంగాల్‌లో కొత్తగా 5,892 కరోనా కేసులు నమోదు కాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,297 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఈ నెల 17న 45 అసెంబ్లీ స్థానాలకు ఐదో విడుత ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో విడుత ఎన్నికల సమయంలో కూచ్ బెహార్‌లో హింస జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో.. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. దీంతో ఎన్నికల ఆంక్షలను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఐదో విడతలో ఉత్తర 24 పరగణాలు, పూర్బా బర్ధమాన్, నాడియా, జల్పాయిగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది.
Also Read: