Uttarakhand Elections Results 2022: దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ జాక్‌పాట్ కొట్టింది. ఊహించినట్లుగానే మరోసారి కాంగ్రెస్‌ను ఖంగుతినిపించి. ఉత్తరాఖండ్‌ను మరోసారి కాషాయం పార్టీ కైవసం చేసుకుంది. మోదీ-అమిత్ షా ద్వయం మార్క్‌తో కాంగ్రెస్‌ను కకావికాలం చేసి.. బీజేపీ సత్తా చాటింది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో కాషాయంపార్టీ క్లియర్ మెజార్టీ సాధించింది. అత్యధికంగా గర్హ్‌వాల్ ప్రాంతంలో బీజేపీ ఎక్కువ స్థానాలతో పట్టు నిలుపుకుంది.
ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డింది. పకడ్బందీగా పార్టీ నిర్మాణంతో పాటే.. అభివృద్ధిపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది కమళదళం. ఐదేళ్లలో కేదార్‌నాథ్ పునర్నిర్మాణాన్ని చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అంతేకాదు రాష్ట్రంలో భారీ రోడ్లు, రైలు, విమాన కనెక్టివిటీ ప్రాజెక్టులు చేపట్టింది. పర్వత ప్రాంతంలో భారీ పైప్‌లైన్ ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు గెలిపిస్తాయనే నమ్మకంతో ఎన్నికల బరిలోకి దిగింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించి కొత్తవారికి కేటాయించారు. ప్రధాని మోదీ ప్రచారం, కేదార్‌నాథ్ అభివృద్ధి, హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్లింది బీజేపీ.
బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. ఐదేళ్లలో మోదీ అనేకసార్లు ఉత్తరాఖండ్‌ను సందర్శించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. ఆర్మీ కుటుంబాల ఓట్లు, వారిలో మోదీకి ఉన్న ఫాలోయింగ్ బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పడాన్ని హిందూ ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లింది బీజేపీ.
మరోవైపు అధికార పార్టీపై నెలకొన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ముఖ్యమంత్రుల మార్పు వంటి సమస్యలతో ప్రజల్లోకి వెళ్లినప్పటికీ కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించలేదు. సొంత పార్టీలోనే అసమ్మతి, భారీగా బరిలో దిగిన రెబల్స్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారు. అంతేకాదు మాజీ సీఎం హరీష్‌రావత్ ఓటమిపాలయ్యారు.
కొనసాగిన సాంప్రదాయం..
ఇక ఉత్తరాఖండ్‌లో గత సాంప్రదాయమే కొనసాగింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరూ మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. 2002లో అప్పటి సీఎం నిత్యానంద స్వామి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2007లో ఓటమి భయంతో పోటీకి దూరంగా ఉన్నారు ఎన్డీ తివారీ. 2012లో కట్ నుంచి పోటీచేసిన సీఎం ఖండూరీ కూడా ఓటమి చెందారు. 2017లో సీఎం హరీష్‌రావత్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి కూడా ఖాతిమా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కాప్రీ చేతిలో పరాజయం పాలయ్యారు. సో…ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసినా…ఎంతటి ప్రజాధారణ నేత అయినా ఓటమి తప్పదనే ప్రచారం సాగుతోంది.
ఉత్తరాఖండ్ ఫలితాల వివరాలు..
మొత్తం (70)
బీజేపీ -47
కాంగ్రెస్ -19
బీఎస్పీ -02
ఇతరులు -02
Also read:
Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!